డీజీపీ డాక్టర్ జితేందర్
అన్ని రకాల నేరాలు కలిపి 9.87% పెరుగుదల.. డ్రగ్‌ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పోలీస్ శాఖ చర్యలు
తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక–2024 విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని, ఒకటి రెండు ఘటనలు మినహా ఈ ఏడాది ప్రశాంతంగా ముగిసినట్టు డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2023లో 2,13,121 కేసులు నమోదు కాగా, 2024లో ఇప్పటి వరకు 2,34,158 కేసులు (9.87 శాతం పెరుగుదల) నమోదైనట్టు వెల్లడించారు. డ్రగ్‌ఫ్రీ తెలంగాణలక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సైబర్ నేరాల కట్టడిలోనూ రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నట్టు పేర్కొన్నారు. ఆదివారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2024ను ఆయన విడుదల చేశారు.
డిజిటల్ స్పేస్‌లో చిన్నారుల భద్రత ఎలా అన్న అంశంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన పుస్తకాన్ని కూడా డీజీపీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా డ్రగ్‌ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా పోలీస్ శాఖ కృషి చేస్తోందని, టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఈ ఏడాది 1,942 డ్రగ్స్ కేసులు నమోదు చేయడంతో పాటు 4,682 మందిని అరెస్టు చేసిందని చెప్పారు. రూ.142.95 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిపారు.
సైబర్ నేరాల పెరుగుదల
సైబర్ నేరాలకు సంబంధించి 2023లో 17,571 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 25,184 కేసులు నమోదైనట్టు డీజీపీ వెల్లడించారు. సైబర్ క్రైం కేసుల్లో రూ.180 కోట్లను తిరిగి బాధితులకు అప్పగించామన్నారు. ఈ ఏడాది జరిగిన నాలుగు ఎదురుకాల్పుల ఘటనల్లో మొత్తం 14 మంది నక్సల్స్ మరణించినట్లు తెలిపారు. మరో 85 మంది మావోయిస్టుల అరెస్టు, 41 మంది మావోయిస్టుల సరెండర్ జరిగినట్టు వివరించారు. డయల్ 100 ఎమర్జెన్సీ నంబర్‌కు మొత్తం 16,92,173 ఫోన్‌కాల్స్ వచి్చనట్టు తెలిపారు. డిజిటల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.
అల్లు అర్జున్ కేసు గురించి మాట్లాడలేను
సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్‌పై నమోదైన కేసుపై ఈ దశలో తానేమీ వ్యాఖ్యానించలేనని డీజీపీ అన్నారు. కేసు దర్యాప్తులో ఉండడంతోపాటు, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ మాట్లాడనని చెప్పారు. లగచర్లలో కలెక్టర్‌పై దాడి దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాఫింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. పోలీసుల ఆత్మహత్యలకు అనేక కారణాలు ఉంటున్నాయని, కేవలం పని ఒత్తిడే అని చెప్పలేమని డీజీపీ అన్నారు.
ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో, కొన్ని కేసుల్లో పని ఒత్తిడి వలన కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. సీఐడీ డీజీ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, అదనపు డీజీలు మహేశ్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్, విక్రమ్‌సింగ్ మాన్, ఐజీలు ఎం.రమేశ్, సుమతి, సు«దీర్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి, సత్యనారాయణ, రమేశ్‌నాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment