సాక్షి, హైదరాబాద్: ‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’.. ఈ సామెత సైబర్ నేరగాళ్లకు చక్కగా సరిపోతుంది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న వేళ.. సైబర్ నేరగాళ్లు సైతం పరిస్థితికి తగినట్లుగా నేరాల రూటు మార్చుకుంటున్నారు. మొన్నటిదాకా పీఎం కేర్స్, ఆరోగ్యసేతు, టిక్‌టాక్ ప్రో యాప్‌లతో బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టిన సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు నేరుగా కోవిడ్ పేషెంట్లనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు కొట్టేస్తున్నారు. ఇందుకోసం కోవిడ్ పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడే ఆక్సిమీటర్లను ఎంచుకున్నారు. ఆక్సిమీటర్లను అమ్ముతామంటూ ఫోన్లకు మాల్‌వేర్‌లను పంపిస్తూ డబ్బులను కొల్లగొడుతున్నారు.
ఏంటి ఈ ఆక్సిమీటర్లు?
సాధారణంగా రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన పరికరమే ఈ ఆక్సిమీటర్. ఇవి బహిరంగ మార్కెట్‌లో రూ.500 నుంచి రూ.5,000 వరకు అందుబాటులో ఉన్నాయి. వీటిని పలు ఈ కామర్స్ వెబ్‌సైట్లు, మెడికల్ షాపులు అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నాయి. కేవలం 3 నుంచి 5 సెంటీమీటర్ల పొడవుండే ఈ పరికరాన్ని చూపుడువేలు చివరన అమరుస్తారు. దానిపై ఉన్న డిజిటల్ తెరపై రక్తంలో ఆక్సిజన్ స్థాయి ప్రమాదకరంగా ఉందా? సంతృప్త స్థాయిలో ఉందా? అన్నది తెలిసిపోతుంది.
మాల్‌వేర్ పంపి..
తమ కుటుంబంలో ఒకరికి కోవిడ్ సోకి.. ఆక్సిమీటర్ల కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తోన్న అమాయకులను సైబర్ నేరస్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. కోవిడ్ పేషెంట్లలో ముందుగా ప్రభావితమయ్యే భాగాలు ఊపిరితిత్తులు. ఒక్కొసారి కొందరిలో ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అలాంటి వారిలో ఆక్సిజన్ స్థాయిలు లెక్కించేందుకు వాడే ఈ పరికరం కోసం చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేయడాన్ని గమనించారు. వెంటనే ఆక్సిమీటర్లు అమ్ముతామంటూ అందరి సెల్‌ఫోన్లకు మాల్‌వేర్ ఉన్న లింకులను పంపుతున్నారు. ఈ మాల్‌వేర్‌లో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే వైరస్‌లు ఉంటాయి. ఫలితంగా ఈ లింకును క్లిక్ చేసిన క్షణాల్లో బ్యాంకు ఖాతాల్లోని మొత్తం నగదు మాయమవుతుంది. ఇలాంటి పరికరాలేమైనా కొనాలనుకుంటే గుర్తింపు ఉన్న ఈ కామర్స్ సైట్లు, ప్రముఖ మెడికల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవాలని, అపరిచిత వ్యక్తులు పంపిన అనుమానాస్పద లింకులు క్లిక్ చేసి చేతిలో డబ్బులు పోగొట్టుకోవద్దని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కోవిడ్ పేషెంట్లకు కొత్తగాలం
Published Wed, Jul 29 2020 5:04 AM | Last Updated on Wed, Jul 29 2020 5:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment