సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మాటున సైబర్ కేటుగాళ్లు హ్యాకింగ్ కాటు వేస్తున్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని ప్రపంచంలోని పలు దేశాల్లో, మన దేశంలో కార్పొరేట్ సంస్థల డేటా చోరీకి పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి, మార్చి 15 నుంచి 19 తేదీ వరకు మరోసారి పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్స్ జరిగినట్టు అంతర్జాతీయ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అందించే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) సైబర్ సెక్యూరిటీ టీమ్ పరిశీలనలో తేలినట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం అప్రమత్తమైంది.
ఏపీలో అప్రమత్తంగా ఉన్నాం..
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు ఆసక్తికర అంశాలను ఎరవేసి ఉచ్చులోకి లాగే ప్రయత్నాలు చేస్తారు. అలాంటి మోసాలపై టెక్నాలజీని వాడుతున్న వారంతా అప్రమత్తంగా ఉండాలి. కరోనా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇదే విషయాన్ని సాకుగా తీసుకుని దేశంలో కొద్ది రోజులుగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్టు గుర్తించాం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సైబర్ ఎటాక్స్ తీరును అప్రమత్తంగానే గమనిస్తున్నాం. సంస్థల డేటా హ్యాకింగ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అనధికార లింక్‌ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి.
ఎలా జరుగుతోంది?
- కరోనా వ్యాప్తి నేపథ్యంలో అనేక కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే విధులు (వర్క్ ఫ్రం హోం) నిర్వహించేలా వెసులుబాటు కల్పించడాన్ని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకున్నారు.
- కరోనా వైరస్ గురించిన ఆసక్తికర విషయాలు అందించే సాకుతో ఈ మెయిల్స్, యాడ్స్, వెబ్‌సైట్ లింక్‌లు, అప్లికేషన్ (యాప్స్) పేరుతో అనేక మందిని వలలోకి లాగుతున్నారు. ఆయా లింక్‌లను ఆసక్తిగా క్లిక్ చేయగానే కంపెనీ, సంస్థ, వ్యక్తిగత డేటా (సమాచారం) చోరీకి గురవుతోంది.
- ‘కోవిడ్ లాక్’ యాప్ పేరుతో పంపిస్తున్న లింక్‌ను క్లిక్ చేయగానే సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేసి కంప్యూటర్లను బాŠల్‌క్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తేనే కంప్యూటర్ తిరిగి పనిచేస్తుందని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేస్తున్నట్టు గుర్తించారు.
- ఇండియాలోనూ ఇదే తరహాలో యజోరాల్ట్ అనే లింక్ ద్వారా మాల్‌వేర్‌తో కంప్యూటర్‌లోకి చొరబడి డేటాను హ్యాక్ చేస్తున్నారు. తద్వారా సంస్థలు, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. యజోరాల్ట్ అనే మాల్‌వేర్ మూడేళ్ల నుంచి ఇండియాలో ఉన్నప్పటికీ తాజాగా
కోవిడ్–19కి సంబంధించిన యాప్‌లకు లింక్ చేసి మోసాలను తీవ్రతరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment