‘కూ’ సంస్థ ప్రతినిధులతో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఉపాధికల్పన అత్యంత సవాల్‌గా మారుతోందని, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువత నిరంతరం నైపుణ్యసాధనపై దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని టీ హబ్ ఆవరణలో పరస్పర అవగాహన ఒప్పందాల మార్పిడి, కాలేజీ యాజమాన్యాలతో భేటీ జరిగింది.
ఈ సందర్భంగా ‘భాగస్వామ్యాల ద్వారా ఉపాధి కల్పన పెంపు’అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో కేటీఆర్ ప్రసంగించారు. టాస్క్, దాని భాగస్వాములు అందిస్తున్న నైపుణ్య శిక్షణను ఉపయోగించుకుని తెలంగాణ యువత ఉపాధి పొందాలని సూచించారు. రాష్ట్రంలో వెల్లువలా వస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌లో 780 కాలేజీలు నమోదైనట్లు వెల్లడించారు.
ఇప్పటి వరకు టాస్క్ ద్వారా 6.53 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణతోపాటు మరో 14,338 బోధకులను కూడా తయారు చేశామన్నారు. ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు టాస్క్ కార్యకలాపాలు విస్తరించామని, త్వరలో మరికొన్ని పట్టణాల్లో కూడా టాస్క్ కార్యకలాపాలు చేపట్టనున్నామని చెప్పారు. కాగా, బుధవారం నైపుణ్యశిక్షణకు సంబంధించి టాస్క్‌తో 26 సంస్థలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి.
వీటిలో ఎల్ అండ్ టీ హెచ్‌ఎంఆర్‌ఎల్, ‘కూ’ఇండియా, మెంటార్ టు గెదర్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. టాస్క్ సంస్థ సీఈవో శ్రీకాంత్ సిన్హా, ఎల్‌అండ్‌టీ హెచ్‌ఎంఆర్‌ఎల్ సంస్థ సీఈవో కేవీబీ రెడ్డి మాట్లాడుతూ మెట్రో ప్రాజెక్ట్‌లో భాగమయ్యేందుకు వీలుగా యువతలో సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు.
27 సంస్థలు టాస్క్‌తో గతంలో కుదుర్చుకున్న ఎంవోయూలను రెన్యువల్ చేసుకున్నాయి. గూగుల్ కెరియర్ సర్టిఫికేషన్ స్కాలర్‌షిప్‌లను కేటీఆర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా, భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ‘కూ’ డెవలప్‌మెంట్ సెంటర్
తొలి దేశీ చాటింగ్ అప్లికేషన్ అయిన ’కూ’ కొత్త డెవలప్‌మెంట్ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, ’కూ’ సంస్థల మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. పలు భారతీయ భాషల్లో చాటింగ్‌కు వీలు కల్పించే ఈ సోషల్ మీడియా వేదికతో కలసి ప్రభుత్వం తెలుగుభాష వాడకాన్ని ప్రోత్సహించనుంది.
’కూ’ లాంటి సంస్థలతో కలిసి ప్రభుత్వ సమాచారాన్ని మరింత సమర్థంగా ప్రజలకు చేరవేయొచ్చని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు. డిజిటల్ మాధ్యమాల్లో స్థానిక భాషలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలన్న భావనకు ‘కూ’కట్టుబడి ఉందని, హైదరాబాద్‌లో ఏర్పడే డెవలప్‌మెంట్ సెంటర్ ఈ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని ’కూ’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అప్రమేయ రాధాకృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment