
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు బాల్యం నుంచే వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించేవిధంగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్‌ఐసీ) కృషి చేస్తోందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపునిచ్చేందుకు, ఆవిష్కరణల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు టీఎస్‌ఐసీ తోడ్పాటునిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో టీఎస్‌ఐసీ, యునిసెఫ్, యువాహ్, ఇంక్వి ల్యాబ్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన ‘స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్–2021’ను విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ప్రారంభించారు. ఈ ఛాలెంజ్‌లో సుమారు 50 వేలమంది విద్యార్థులు పాల్గొనే అవకాశముందని కేటీఆర్ వెల్లడించారు. 2020లో నిర్వహించిన తొలి స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌కు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. 21వ శతాబ్దంలో నైపుణ్యాలు, డిజైన్లపై వినూత్న ఆలోచనలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు.
ఆలోచనలకు ‘ఛాలెంజ్’...
గత ఏడాది నిర్వహించిన తొలిదశ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో 33 జిల్లాల పరిధిలోని 5 వేలకుపైగా పాఠశాలల నుంచి 25 వేలకుపైగా విద్యార్థులు పాల్గొన్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తమ పరిసరాల్లో ఉండే వివిధ అంశాలకు సంబంధించి విద్యార్థుల ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం, యునిసెఫ్ ప్రతినిధి జాన్ బ్రి ట్రూ, ఇంక్విలాబ్ సహ వ్యవస్థాపకులు సాహిత్య అనుమోలు తదితరులు పాల్గొన్నారు.
ఈసారి గురుకుల, ప్రైవేట్ స్కూళ్లకు కూడా..
ఆవిష్కరణలపై యునిసెఫ్ రూపొందించిన పాఠ్యాంశాల్లో 5,200 మంది ఉపాధ్యాయులతోపాటు 6 నుంచి 10వ తరగతి చదివే 25 వేలమంది విద్యార్థులను టీఎస్‌ఐసీ భాగస్వాములను చేసింది. 2020 స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌లో భాగంగా సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతూ 7వేలకుపైగా ఆవిష్కరణలు అందాయి. గతేడాది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను పరిమితం చేయగా, ఈసారి సాంఘిక, గిరిజన గురుకుల పాఠశాలలు, ప్రైవేట్ స్కూల్స్‌ను కూడా ఇందులో భాగస్వాములను చేయనున్నారు. 33 జిల్లాల నుంచి ఎంపిక చేసి ఫైనలిస్టులకు నగదు బహుమతి అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment