కంచర్ల లక్ష్మారెడ్డి (ఫైల్)
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీనియర్ పాత్రికేయుడు కంచర్ల లక్ష్మారెడ్డి (93) గురువారం కన్నుమూశారు. పూర్వపు నల్లగొండ జిల్లా పర్సాయపల్లికి చెందిన కేఎల్ రెడ్డి కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 15 రోజులుగా గ్రేటర్ వరంగల్‌లోని గొర్రెకుంటలో ఉన్న ఆనంద ఆశ్రమంలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం ఉదయం మృతిచెందారు. బంధువులు ఆయన భౌతికకా యానికి హైదరాబాద్‌లోని నాగోల్‌లో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
సుదీర్ఘ పాత్రికేయ జీవితం
1950లో ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి కేఎల్ రెడ్డి తెలుగుదేశం పేరిట వచ్చిన రాజకీయ వారపత్రికతో జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఈనాడు, నేటి నిజం, సాయంకాలం, మహానగర్ ఇలా పలు పత్రికల్లో పనిచేశారు. ‘తెలంగాణ ప్రభ’ పేరుతో వారపత్రికను, ‘కాలేజీ విద్యార్థి’ పేరుతో మాస పత్రికను సొంతంగా నడిపారు. 1969 తెలంగాణ ఉద్య మం సమయంలో ఆ వార్తలతో ‘నేడు’ పేరిట 3 నెలలపాటు కరపత్రాన్ని వెలువరించారు. రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక పత్రిక స్థాయిలో ‘నేడు’ను వెలువరించడం నేరంగా పరిగణించి ఆయనకు నెల రోజులు జైలుశిక్ష కూడా వేశారు.
సీఎం, ప్రముఖుల సంతాపం
సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి పత్రికా రంగానికి నిస్వార్థ సేవలు అందించారని, ఆయన మృతి తీరని లోటు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
ఐజేయూ, టీయూడబ్ల్యూజే నివాళి
సీనియర్ పాత్రికేయులు జీఎస్ వరదాచారి, కేఎల్ రెడ్డిల మృతిపట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) ప్రగాఢ సంతాపం వ్యక్తం ప్రకటించాయి. తెలుగు పత్రికా రంగం ఒకేరోజు ఇద్దరు పాత్రికేయ దిగ్గజాలను కోల్పో యిందని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment