తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌@ 2.90 లక్షల కోట్లు | Telangana State Budget 2024-25 Nearly Three Lakh Crores | Sakshi
Sakshi News home page

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌@ 2.90 లక్షల కోట్లు

Published Thu, Jul 25 2024 5:15 AM | Last Updated on Thu, Jul 25 2024 6:36 AM

Telangana State Budget 2024-25 Nearly Three Lakh Crores

2024–25 బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధం 

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నభట్టి విక్రమార్క.. మండలిలో శ్రీధర్‌బాబు 

వాస్తవిక కోణంతో పాటు ఆదాయం

పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌కు రూపకల్పన

సాక్షి, హైదరాబాద్‌: వాస్తవిక కోణాన్ని ప్రతిబింబిస్తూనే అదనపు ఆదాయ రాబడులు, ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.2,75,890 కోట్లను ప్రతిపాదించిన ప్రభుత్వం దాని కంటే 5 శాతం మేర కేటాయింపుల పెంపుతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. 

గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.  

రాబడుల్లో సంస్కరణలు 
అప్పుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. జీఎస్టీ లీకేజీలు అరికట్టాలని, గనుల రాయల్టీ చెల్లింపు ఎగవేతలను నిరోధించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఏడాదిలో భూముల మార్కెట్‌ విలువల సవరణ జరిగితే రూ.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. 

మరోవైపు ఈ బడ్జెట్‌లో పన్నేతర ఆదాయం కింద భూముల అమ్మకాలను ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. మద్యం రేట్లు పెంచడం, ఎలైట్‌ షాపుల ఏర్పాటు లాంటి విధాన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెరిగిన ఆదాయానికి తోడు, ఆర్థిక వృద్ధి కూడా కేటాయింపులకు ఊతమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

అన్ని పద్దులూ కీలకమే! 
ఈసారి బడ్జెట్‌లో అన్ని శాఖల పద్దులూ భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రుణమాఫీతో కలిపి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.64 వేల కోట్లు, సాగునీటి శాఖకు రూ.26–28 వేల కోట్లు, విద్యా శాఖకు రూ.21 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.45 వేల కోట్ల వరకు, సంక్షేమ శాఖలకు రూ.40 వేల కోట్లు, మున్సిపల్‌ శాఖకు రూ.12 వేల కోట్లు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి రుణమాఫీకే రూ.31 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. 

అందులో ఇప్పటికే రూ.6 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఆగస్టు నెలాఖరు నాటికి మిగిలిన రూ.25 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇక ఆరు గ్యారంటీలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, గృహలక్షి్మ, పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, మరిన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలల ఏర్పాటుకు బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరం కాగా, అందులో ఏ మేరకు నిధులు ప్రతిపాదిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. సాగునీటి శాఖకు సంబంధించి రూ.9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరం కాగా, అప్పులు, వేతనాలు, ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ప్రాధాన్యతా ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు అవసరమపి ఆ శాఖ కోరింది. శాఖల వారీ కేటాయింపులకు తోడు అప్పుల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం వేతనాలు, సాధారణ వ్యయం, విద్యుత్‌ సబ్సిడీలు (గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌) తదితర అనివార్య చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది.
  
పింఛన్ల పెంపు కష్టమేనా? 
ఎన్నికలకు ముందు ఆసరా పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్‌ ప్రకారం ఏడాదికి రూ.11 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. కాగా హామీ ఇచ్చిన ప్రకారం పెంచితే నెలకు రూ.1,000 కోట్ల చొప్పున ఏడాదికి మరో రూ.12 వేల కోట్లు అవసరమవుతాయి. 

ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో పింఛన్ల పెంపు ప్రతిపాదన ఉంటుందా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. అయితే వాస్తవిక కోణంలో బడ్జెట్‌ రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చినందున ఈ ఏడాదికి పింఛన్ల పెంపు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.45వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.  

ఆర్థిక వృద్ధి ఆసరాగా..! 
పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈసారి 6.5 నుంచి 7 శాతం వరకు ఆర్థిక వృద్ధి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి వృద్ధి కంటే తెలంగాణ వృద్ధి మరో 2–3 శాతం వరకు ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. ఈ వృద్ధికి తోడు రెవెన్యూ రాబడుల్లో చేపడుతున్న సంస్కరణల కారణంగా వచ్చే అదనపు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటాన్‌ అకౌంట్‌లో పెట్టిన రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్‌ను మరో రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పెంచుతూ పూర్తిస్థాయి బడ్జెట్‌ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement