సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. పదోన్నతి పొందినా పాత పోస్టుల్లోనే ఏళ్ల తరబడి నెట్టుకొస్తూ బదిలీ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు కొందరైతే.. కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ పూర్తి చేసుకొని వచ్చిన వారు మరికొందరు. వీరే కాక శిక్షణ పూర్తి చేసుకొని ఉత్సాహంతో పనిచేయాల్సిన యువ ఐపీఎస్‌లు కూడా నెలల తరబడి పోస్టింగ్ లేక ఇళ్లకే పరిమితమయ్యారు.
అదనపు డీజీపీ నుంచి ఏఎస్పీ దాకా పదుల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు వెయిటింగ్‌లో ఉండిపోయారు. కొంతమంది అధికారులైతే ఏకంగా నెలల నుంచి వెయిటింగ్ ట్యాగ్‌తో ఉండిపోయారు. వెయిటింగ్‌లో ఉన్నన్నాళ్లు జీతాలు రావు. అంతేకాదు కూర్చుందామన్నా ఏ ఆఫీస్‌లో సీటు కూడా ఉండదు. అటు ఆఫీస్‌కు వెళ్లలేకా.. ఇటు ఇంట్లో ఉండలేక కాలాన్ని గడిపేస్తున్నారు.
డిప్యుటేషన్ పూర్తిచేసుకొని...
సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీపీ హోదాలో ఉన్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ పూర్తి చేసుకొని నెల క్రితమే రాష్ట్రంలో రిపోర్ట్ చేశారు. అదేవిధంగా కేంద్ర సర్వీసులోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నుంచి ఐజీ విజయ్ కుమార్ (1997) సైతం డిప్యుటేషన్ పూర్తి చేసుకొని వచ్చి రిపోర్ట్ చేశారు. ఇంటర్‌కేడర్ డిప్యుటేషన్‌లో భాగంగా పంజాబ్‌లో పనిచేస్తున్న డీఐజీ విక్రమ్ జిత్ దుగ్గల్ (2007) కూడా తిరిగి వచ్చి రాష్ట్ర పోలీస్ శాఖకు రిపోర్ట్ చేశారు. వీరంతా వెయిటింగ్ లిస్టులోనే ఉండిపోయారు.
బదిలీపై వచ్చి...
కరీంనగర్ కమిషనర్‌గా ఐదేళ్లపాటు పనిచేసిన వీబీ కమలాసన్ రెడ్డి (2004 బ్యాచ్) గత జూలైలో బదిలీ అయ్యారు. డీజీపీ కార్యాలయం లో రిపోర్ట్ చేసిన ఆయనకు ఇప్పటివరకు పోస్టిం గ్ లేదు. అదే రీతిలో మహబూబ్‌నగర్ ఎ స్పీ స్థా నం నుంచి ఏప్రిల్‌లో బదిలీ అయిన ఐపీఎస్ రె మా రాజేశ్వరి (2009) సైతం అప్పటి నుంచి వెయిటింగ్‌లోనే ఉండిపోయారు. ఇటీవల సూ ర్యాపేట ఎస్పీగా ఉన్న ఆర్.భాస్కరన్ (2012) బదిలీ అయి ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్నారు.
కేడర్ మార్పుతో..
ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు కేడర్ మార్పుతో తెలంగాణ పోలీస్ శాఖకు వారం క్రితం రిపోర్ట్ చేశారు. రిటైర్డ్ డీజీపీ ఏకే మహంతీ కుమారుడు, సీనియర్ ఐపీ ఎస్ అవినాష్ మహంతీ సోదరుడు అభిషేక్ మ హంతి (2011) ఏపీ నుంచి తెలంగాణకు కేడర్ మార్చుకొని వెయిటింగ్‌లో ఉన్నారు. అదేవిధం గా రాష్ట్ర పోలీస్ సర్వీస్ (ఎస్‌పీఎస్) కోటా నుం చి ఐపీఎస్ అయిన గ్రూప్–1 అధికారి నారాయణ్ నాయక్ కేడర్ అలాట్‌మెంట్‌లో భాగంగా తెలంగాణకు వచ్చారు.
ఆయనా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా యూపీఎస్సీ ద్వారా ఐపీఎస్ అయి నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 13 మంది యువ ఐపీఎస్‌లు సైతం పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లోనే ఉన్నారు. ఏఎస్పీలుగా ఉన్న వీరు ఆరు నెలలుగా వెయిటింగ్ లోనే ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాలు చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment