సాక్షి, హైదరాబాద్: ఒక వైద్య విద్యాసంవత్సరంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో 8 మెడికల్ కాలేజీలు కొత్తగా ప్రారంభం కావడం, ఆయా కాలేజీల్లో ఏకంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి రావడం రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలవనుంది. 2022–23 వైద్య విద్యా సంవత్సరంలో కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, సంగారెడ్డి, రామగుండం, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల ల్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు సహా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి.
2014లో 850 ప్రభుత్వ సీట్లుండగా... ఇప్పుడు 2,815
తెలంగాణ ఏర్పడకముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 మెడికల్ కాలేజీలు ఉండగా వాటిల్లో 850 సీట్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక కాలేజీల సంఖ్య 17కు పెరగ్గా సీట్ల సంఖ్య 2,815కి పెరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నల్లగొండ, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలో 4 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిదేళ్లలో కొత్తగా 12 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 157 కాలేజీలను ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే కొత్త మెడికల్ కాలేజీలన్నింటినీ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలోకన్నా 3 రెట్లకుపైగా ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. వచ్చే ఏడాది 9 కొత్త మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాది మరో 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇప్పటికైనా కేంద్రం కొత్త కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సహకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేస్తున్నారు.
► 2014లో రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. మొత్తం 20 కాలేజీలున్నాయి.
► 2022 (ప్రస్తుతం)లో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 24 ప్రైవేటు కాలేజీలు అయ్యాయి.
► 2014లో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వంలో 850, ప్రైవేటులో 2,100... మొత్తం 2,950
► 2022లో ప్రభుత్వంలో 2,815 ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటులో 3,800 సీట్లు... మొత్తం 6,615
► 2014లో పీజీ మెడికల్ సీట్లు ప్రభుత్వంలో 529, ప్రైవేటులో 601... మొత్తం 1,130
► 2022లో పీజీ మెడికల్ సీట్లు ప్రభుత్వంలో 1,850, ప్రైవేటులో 613... మొత్తం 2,463
► 2014లో నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వంలో ఐదు, ప్రైవేటులో 74... మొత్తం 79
► 2022లో నర్సింగ్ కాలేజీలు ప్రభుత్వంలో 9, ప్రైవేటులో 83... మొత్తం 92
చదవండి: అసెంబ్లీ సెగ్మెంట్లపై నజర్.. ఎన్నికలకు సమాయత్తంపై కేసీఆర్ ఫోకస్
Comments
Please login to add a commentAdd a comment