సాక్షి,కోనరావుపేట(వేములవాడ): వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న అధికారుల అత్యుత్సాహానికి నిండు ప్రాణం బలైంది. బలవంతంగా వేసిన టీకా వికటించి ఒకరు మృతిచెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన సింగిల్‌విండో మాజీ డైరెక్టర్ రేగుల సత్తయ్య(52) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.
ఈ నెల 16న సత్తయ్యకు ఇంటికి ఏఎన్‌ఎం, ఎంపీవో, గ్రామకార్యదర్శి రాగా.. తాను అనారోగ్యంతో ఉన్నానని.. టీకా తీసుకుంటే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. అయినా వారు వినలేదు. బలవంతంగా కోవాగ్జిన్ మొదటి డోస్ ఇచ్చారు. టీకా ఇచ్చిన గంట తర్వాత సత్తయ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కోనరావుపేట ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నొప్పుల మాత్రలు వేసుకోవడంతో పరిస్థితి విషమించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఈ నెల 19న సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.
వ్యాక్సిన్‌తోనే మృతి..
అనారోగ్యంతో బాధపడుతున్న తమ తండ్రి సత్తయ్యకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడంతోనే పరిస్థితి విషమంగా మారి మృతిచెందాడని కుమారుడు అజయ్, కూతురు రమ్య, భార్య మణెమ్మ ఆరోపించారు. కోనరావుపేట వైద్యులు ఇచ్చిన నొప్పి మాత్రలు ఎందుకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి వ్యాక్సిన్ ఇచ్చి, నొప్పుల మాత్రలు వేయడంతో మృతి చెందినట్లు వారు ఆరోపిస్తున్నారు.
ధర్మారం గ్రామానికి చెందిన సత్తయ్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కోవాగ్జిన్ టీకా బాగుందని ప్రజలు భావిస్తుండడంతో ఆ టీకానే అందరికీ ఇస్తున్నాం. నొప్పుల మాత్రలతో అరుదుగా ప్రమాదం సంభవించే అవకాశముంది. సత్తయ్య మృతికి వ్యాక్సిన్ కారణం కాదు.
– సుమన్‌మోహన్‌రావు, డీఎంహెచ్‌వో
Comments
Please login to add a commentAdd a comment