హైదరాబాద్, సాక్షి: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో దక్షిణ భాగంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉత్తరం వైపు మరో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment