సాక్షి, హైదరాబాద్: నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, యూసఫ్‌గూడ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, ఉప్పల్, బోడుప్పల్, బేగంపేట్, సికింద్రాబాద్, ఆల్వాల్.. ఇలా చాలా చోట్ల సోమవారం పొద్దుపొద్దున్నే చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వాన పడుతోంది.
ఆకాశం భారీగా మేఘావృతం అయి ఉండడంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దసరా సెలవుల తర్వాత విద్యాసంస్థలు మొదలు అవుతుండడం, మరోవైపు ఆఫీస్ వేళలు కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అధికార యంత్రాంగం సైతం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం.. నగరాన్ని ముంచెత్తింది. అయితే ఆదివారం కాస్త ఉపశమనం ఇవ్వడంతో వరుణుడి గండం తొలగిందని అంతా అనుకున్నారు. అయితే.. మరో రెండు రోజులపాటు వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్ష ప్రభావం కనిపిస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment