ఫ్రెంచ్ సెనేట్‌లో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వ పరిధిలో జాతీయ విధానాలు రూపుదిద్దుకుంటున్నా.. భారత సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు పలు అంశాల్లో స్వయం ప్రతిపత్తిని గణనీయంగా పెంచుకుంటున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పరిశ్రమలకు అనుమతులు, భూ కేటాయింపు, ఆమోదం, కంపెనీలకు అవసరమైన శిక్షణ పొందిన మానవ వనరులు అందేలా చూడటం, వనరుల సేకరణ వంటి అంశాల్లో రాష్ట్రాలు సొంత విధానాలు రూపొందించుకుంటున్నాయని తెలిపారు.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగిన ‘యాంబిషన్ ఇండియా 2021’వాణిజ్య సదస్సులో కేటీఆర్ శుక్రవారం కీలకోపన్యాసం చేశారు. సెనేట్ సభ్యులతో పాటు స్థానిక వాణిజ్య, రాజకీయ వర్గాల ప్రముఖులు పాల్గొన్న ఈ సదస్సులో, ‘కోవిడ్ తదనంతర కాలంలో భారత్–ఫ్రెంచ్ సంబంధాల భవిష్యత్తుకు కార్యాచరణ’అంశంపై మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏడేళ్లుగా తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న ప్రగతిశీల విధానాలు, సాధించిన అభివృద్ధిని వివరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా ఫ్రెంచ్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలోని పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీల కోసం, ముఖ్యంగా ఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
టీఎస్ ఐపాస్‌తో త్వరితగతిన అనుమతులు
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు 15 రోజుల వ్యవధిలో సులభంగా లభించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ విధానాన్ని అమలు చేస్తోందని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) వద్ద రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన మానవ వనరులను అందించేందుకు రాష్ట్రప్రభు త్వం ‘తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలె డ్జ్’(టాస్క్) ద్వారా సొంత ఖర్చుతో శిక్షణ ఇస్తోం దని తెలిపారు.
పెట్టుబడులతో ముందుకువచ్చే సంస్థల ఆకాంక్షలకు అనుగుణంగా వసతులు సమకూరుస్తామన్నారు. ‘యాంబిషన్ ఇండియా 2021’ సదస్సులో తెలంగాణను భాగస్వామ్య రాష్ట్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
‘క్యాంపస్ స్టేషన్ ఎఫ్’సందర్శన
పారిస్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ‘క్యాంపస్ స్టేషన్ ఎఫ్’ను కేటీఆర్ సందర్శించారు. తెలంగాణలో ఆవిష్కరణల వాతావరణం పెంపొందించేందుకు ‘టీ హబ్’, ‘వీ హబ్’, ‘టీ వర్క్స్’వంటి ఇంక్యుబేటర్లతో అవకాశాలు, పరస్పర అవగాహనపై చర్చించారు. పారిస్ నడిబొడ్డున గతంలో రైల్వే డిపోగా ఉన్న ‘స్టేషన్ ఎఫ్’ను వేయి స్టార్టప్‌లతో కూడిన ప్రత్యేక క్యాంపస్‌గా తీర్చిదిద్దిన తీరుపై వివరాలు సేకరించారు. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయంలో పెట్టుబడులు పెట్టిన ‘ఎయిర్‌పోర్ట్స్ డి పారిస్’(ఏడీపీ) చైర్మన్, సీఈఓ ఆగస్టిన్ రోమనెట్‌తోనూ కేటీఆర్ బృందం భేటీ అయ్యింది.
కరోనా తదనంతర పరిస్థితుల్లో భారత్‌లో విమానయాన పరిశ్రమ వేగంగా వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. సనోఫీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ హెడ్ ఫాబ్రిస్ బస్చిరా, గ్లోబల్ వ్యాక్సిన్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ ఇసాబెల్లె డెస్చాంప్‌తోనూ కేటీఆర్ వేర్వేరుగా భేటీ అయ్యారు. సనోఫి సంస్థ త్వరలో హైదరాబాద్‌లోని తమ ఫెసిలిటీ ద్వారా ‘సిక్స్ ఇన్ వన్’వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆయా సమావేశాల్లో కేటీఆర్‌తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
సీఈవోలతో భేటీ
పారిస్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధుల బృందం వరుసగా రెండోరోజు కూడా పలు ఫ్రెంచ్ వ్యాపార సంస్థల అధినేతలతో సమావేశమైంది. మూవ్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్ (ఎంఈడీఈఎఫ్) డిప్యూటీ సీఈఓ జెరాల్డిన్‌తో జరిగిన భేటీలో ఫ్రెంచ్ ఎస్‌ఎంఈలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్న సహకారాన్ని కేటీఆర్ వివరించారు.
ఫ్రాన్స్‌లోని 95 శాతం వ్యాపార సంస్థలు, ఎస్‌ఎంఈలు ఎంఈడీఈఎఫ్ నెట్‌వర్క్‌లో అంతర్భాగంగా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆహార ధాన్యాలు, మాంసం, పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ఇటీవలి కాలంలో సాధించిన విజయాలను మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment