కుటుంబం ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని పట్టించుకునే మహిళలు తమ ఆరోగ్యం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు. మహా అయితే లావు అయిపోతున్నామనే బెంగ, లేదంటే పెళ్లయ్యాక ఇంతేలే అనే నైరాశ్యం.. అంతకుమించి ఆలోచించరు. మరీ భారీకాయం వస్తోందనుకుంటే.. కడుపు మాడ్చుకుంటారు. మరికొందరు సీరియస్‌గానే యోగా, వాకింగ్ లాంటివి చేస్తారు. అయినా ఫలితం కనపడదు.
ముఖ్యంగా వేలాడే భారీ పొట్ట, చాలా నల్లగా ముఖంపై చర్మం మారిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం మహిళల్లో అయితే గైనిక్ సమస్యలు మరింత వేధిస్తాయి. అలాగే విపరీతమైన మతిమరుపు మరో ప్రధాన లక్షణం. అయితే సమస్య ఇదీ అని తెలియక సంవత్సరాల తరబడి ఏవో మందులు వాడుతూ కాలం గడిపేస్తూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు అవుతుంది అనేది సీరియస్‌గా ఆలోచించాల్సిన వ్యాధి ఒకటి వుంది. దాని పేరే కుషింగ్స్.
దాదాపు 90 సంవత్సరాల క్రితం 1932లో ఈ వ్యాధిని మొదటిసారిగా న్యూరో సర్జరీ పితా మహుడిగా ప్రసిద్ధి చెందిన హార్వే కుషింగ్ గుర్తించారు. అలా ఆయన పేరుతో కుషింగ్స్ డిసీజ్ ప్రపంచానికి తెలిసింది. ఆయన పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8న కుషింగ్స్ డిసీజ్‌పై అవగాహన దినంగా పాటిస్తున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ స్టోరీ.
ఒకవిధంగా చెప్పాలంటే కుషింగ్స్ గురించి చాలామంది అవగాహన లేదు. మెదడులోని పిట్యూటరీ గ్రంధి, మూత్రపిండం మీద ఉండే అడ్రినల్ గ్రంధి మీద కణితి ఏర్పడి పెద్ద మొత్తంలో అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్‌ను విడుదల చేసినప్పుడు కుషింగ్స్ వ్యాధి వస్తుంది. ఫలితంగా కార్టిసాల్ ఉత్పత్తి అధికవుతుంది. ఫలితంగా ఇది అనేక ఇతర రుగ్మతలకు దారి తీస్తుంది. ఏటా 60 లక్షలమంది అరుదైన ఈ కుషింగ్స్ వ్యాధి బారిన పడుతున్నారు. 20-50 సంవత్సరాల వయస్సు వారిలో ఈ వ్యాధిని గమనించవచ్చు. పురుషులతో పోలిస్తే మహిళల్లో 3 రెట్లు ఎక్కువని తాజా గణాంకాల ద్వారా తెలుస్తోంది.
కుషింగ్స్ వ్యాధి ఎలా వస్తుంది?
అడ్రినల్ గ్రంథులు ప్రతి మూత్రపిండం పైభాగంలో త్రిభుజం ఆకారంలో ఉంటాయి. కార్టిసాల్ అనే హార్మోన్ కార్టెక్స్ అడ్రినల్ గ్రంథుల బయటి పొర ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇదొక స్టెరాయిడ్ హార్మోన్. ఇది కొవ్వులు, ప్రోటీన్లను వేరు చేయడానికి, ఒత్తిడి రక్తపోటు నియంత్రణకు, గుండె సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. అందుకే కార్టిసాల్‌ను ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. మెదడులోని పిట్యూటరీ గ్రంధి లేదా కిడ్నీపైన ఉండే అడ్రినల్ గ్రంధిపైన ట్యూమర్ కారణంగా కార్టిసాల్ రిలీజ్ బాగా పెరగడాన్ని హైపర్‌కార్టిసోలిజం అని కూడా అంటారు.
కుషింగ్స్ లక్షణాలు
మొటిమలు, ముఖం విపరీతమైన నల్లగా మారిపోవడం
బఫెలో హంప్ (మెడ వెనుక అదనపు కొవ్వు చేరి గూని లాగా ఏర్పడటం)
పొత్తికడుపు చుట్టూ విపరీతంగా కొవ్వు చేరడం
రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగడం లేదా హైపర్ గ్లూసేమియా
అధిక దాహం, అలసట, అతి మూత్రవిసర్జన, తలనొప్పి, విపరీతమైన మతిమరుపు
అధిక రక్త పోటు, అవాంఛిత రోమాలు, మహిళల్లో ఋతుక్రమంలో మార్పులతో పాటు మానసిక అస్థిరత, నిరాశ, సక్రమంగా తీవ్ర భయాందోళన. పురుషుల్లో వ్యంధ్యత్వానికి దారి తీస్తుంది.
కుషింగ్స్ డిసీజ్ గుర్తింపు, చికిత్స
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎండోక్రినాలజిస్ట్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మూత్రం, రక్తం, హార్మోన్ల పరీక్ష ద్వారా కుషింగ్స్ వ్యాధిని గుర్తింవచ్చు. అలాగే మెదడు, కిడ్నీపైన ఉన్న కణితిని గుర్తించేందుకు సీటీ స్కాన్ లేదా ఎంఆర్‌ఐ పరీక్షలు అవసరం. ఒక వేళ కణితి పెద్దదిగా ఉంటే ఆపరేషన్ కూడా చేయించుకోవాల్సి వస్తుంది. క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి.
విశాఖ జిల్లా, పాయకరావు పేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయిని విజయభాను కోటె కుషింగ్స్ బారిన పడి ఇపుడిపుడే కోలుకుంటున్నారు. విద్యా వ్యవస్థలో హ్యుటగాజీని పరిచయం చేసిన ఘనత విజయభానుకే దక్కుతుంది. అలా విద్యార్థుల్లో సహజంగా నేర్చుకునే గుణాన్ని పెంపొందిస్తూ, తన విద్యార్థులను, వారి అభివృద్ధిని ప్రాణానికి ప్రాణంగా భావించే భాను ఈ కుషింగ్స్ వ్యాధిపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భావించడం విశేషం. ఈ క్రమంలోనే తన అనుభవాలు, సూచనలు వీడియో ద్వారా సాక్షి.కామ్‌కు అందించడం అభినందనీయం. హ్యాట్సాఫ్ టూ విజయభాను కోటె.
Comments
Please login to add a commentAdd a comment