ఇప్పటివరకున్న వాహనాల నంబర్లు టీఎస్ పేరిటే
ఆర్టీసీలో త్వరలో 3,500 పోస్టుల భర్తీ
అదనంగా మరో 1,000 బస్సులు
మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలోని వాహనాలు శుక్ర వారం(నేటి) నుంచి టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, రోడ్డు రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలకు భిన్నంగా టీఎస్ పేరుతో వాహనాల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం ఏర్పాడాలనే ఆకాంక్షతో పాల్గొన్న ఉద్యమకారులు, ప్రజలు తమ వాహనాలపై ఆరోజే టీజీ ఆని రాసుకున్నారని గుర్తు చేశారు.
అయితే అప్పుడు అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ టీజీకి బదులు టీఎస్‌ను తెచ్చి వారి ఆకాంక్షలు, మనోభా వాలను అణచివేసిందని విమర్శించారు. గురువారం హను మకొండ కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌తో కలి సి మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు నెరవేరేలా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని శాసనసభ ఆమోదంతో టీఎస్‌ను టీజీగా మారుస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కేంద్రానికి కూడా లేఖ పంపించామని, శుక్రవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలన్నీ టీజీ మీదనే అవుతాయని, ఇప్పటివరకు రిజిస్టర్ అయిన వాహనాల నంబర్లు అలాగే ఉంటాయని చెప్పారు.
ప్రతి వీఐపీ డ్రైవర్‌కు ఫిట్‌నెస్ టెస్టులు
డ్రైవింగ్ లైసెన్సుల జారీ విషయంలో నిబంధనలను కఠిన తరం చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రతి వీఐపీ డ్రైవర్‌కు కూడా ఫిట్‌నెస్ టెస్టులు నిర్వహించాలనే నిబంధనలను తీసుకువచ్చామన్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి కొత్తబస్సులు తెచ్చామని, త్వరలోనే మరో వెయ్యి బస్సులు తేనున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని కేడర్‌లకు చెందిన 3,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వివరించారు. ఆర్టీసీ కార్మికులకు 21 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని, కార్మికులు సంతోషంగా ఉన్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
ఇక మూడు సిరీస్‌ల ముచ్చట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలకు శుక్రవారం నుంచి టీజీ రిజిస్ట్రేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఇకపై మూడు సిరీస్‌లతో తెలంగాణ వాహనాలు కనిపించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వాహనాలకు ఏపీ సిరీస్ కొనసాగింది.
రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 జూన్‌లో టీఎస్ సిరీస్ అందుబాటులోకి వచ్చినా, అప్పటివరకు ఏపీ సిరీస్‌తో ఉన్న వాహనాలకు పాత సిరీస్‌నే కొనసాగించొచ్చని నాటి ప్రభుత్వం పేర్కొంది. దీంతో 2014 జూన్(టీఎస్‌గా మారకముందు)కు ముందు నాటి వాహనాలు ఏపీతో, ఆ తర్వాతవి టీఎస్‌తో కొనసాగుతున్నాయి. శుక్రవారం నుంచి టీజీ సీరీస్ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. దీంతో మూడు సిరీస్‌లతో వాహనాలు కనిపించనున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,91,666 వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70,81,345 వాహనాలు ఏపీ సిరీస్‌తో ఉండగా, 98,10,321 వాహనాలు టీఎస్ సిరీస్‌తో నడుస్తున్నాయి. రాష్ట్ర సిరీస్ తప్ప జిల్లా సిరీస్‌లు యధాతథంగా కొనసాగుతాయి. టీజీ జెడ్ ఆర్టీసీ వాహనాలకు, టీజీ09 పీ పోలీసు వాహనాలకు, నంబర్ల పక్కన టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లు రవాణా వాహనాలకు కొనసాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment