ఇసుకేతర ఆదాయానికి టీజీఎండీసీ కొత్తమార్గాల వెతుకులాట
కొత్తగా సున్నపురాయి, క్వార్ట్జ్, ఫెల్డ్‌స్పార్ లీజుకు దరఖాస్తు
జాతీయస్థాయిలోనూ ఖనిజాన్వేషణ ప్రాజెక్టులకు ప్రయత్నం
ఒడిశాలో సున్నపురాయి గనుల లీజుకు సంస్థ ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఇతర ఆదాయ వనరులపై దృష్టి సారించింది. సంస్థకు ఏటా వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా, అదంతా రాష్ట్ర ఖజానాకు చేరుతోంది. దీంతో టీజీఎండీసీ ఖాతా ఎప్పటికప్పుడు ఖాళీ అవుతోంది. ఫలితంగా ఇసుక వెలికితీస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు నెలల తరబడి పేరుకుపోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇసుక విక్రయాల్లో లోపాలను అరికట్టడంతోపాటు ఇతర ఖనిజాల అన్వేషణ, విక్రయం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. నాపరాయి, మార్బుల్, సున్నపురాయి, క్వారŠట్జ్, ఫెల్డ్‌స్పార్ గనులను లీజుకు తీసుకొని వెలికితీత, విక్రయాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు జాతీయస్థాయిలోనూ సున్నపురాయి గనులను లీజుకు తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
ఏటా రూ.వందల కోట్ల ఆదాయం వస్తున్నా..
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సగటున ఏటా రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్ల మేర ఇసుక విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ఏటా సుమారు కోటిన్నర క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుకను వెలికితీసి ఆన్‌లైన్ విధానంలో విక్రయిస్తోంది. సంస్థ నిర్వహణ వ్యయం, ప్రభుత్వ ఖజానాకు చేరుతున్న ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే టీజీఎండీసీ లాభాలు ఏటా రూ.30 కోట్లకు మించడం లేదు. ఇదిలా ఉంటే రీచ్‌ల నుంచి ఇసుకను వెలికితీసి స్టాక్ పాయింట్లకు తరలిస్తున్న కాంట్రాక్టు సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు కూడా రూ.400 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్నట్టు టీజీఎండీసీ వర్గాలు వెల్లడించాయి.
సంస్థ ఆదాయం రాష్ట్ర ఖజానాకు మళ్లుతుండటంతో ఈ తరహా పరిస్థితి తలెత్తినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సంస్థ ఆదాయం పెంచుకునే దిశగా టీజీఎండీసీ ఆలోచన చేస్తోంది. సంస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ(ఎన్‌ఈఏ) గుర్తింపు ఉండటంతో జాతీయస్థాయిలోనూ ఖనిజాల వెలికితీత, విక్రయాలపై దృష్టి సారించింది.
సున్నపురాయి గనుల లీజు కోసం..
రాష్ట్రంలో ఐదుచోట్ల 83.23 హెక్టార్ల ప్రభుత్వ, అటవీభూముల్లో ఉన్న నాపరాయిని వెలికితీయడం, ఖమ్మం జిల్లా ఇల్లెందు పరిసరాల్లో పాలరాయి నిల్వల మదింపుపై టీజీఎండీసీ దృష్టి పెట్టింది.
⇒ మంచిర్యాల జిల్లా దేవాపూర్ సమీపంలో 880 హెక్టార్ల అటవీ భూ మిని సున్నపురాయి వెలికితీత కోసం 2018లోనే రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది.
⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో క్వారŠట్జ్, ఫెల్డ్‌స్పార్ క్వారీల లీజు కోసం దరఖాస్తులు అందాయి.
⇒ గుండాల అటవీ ప్రాంతంలోని పలు కంపార్ట్‌మెంట్లలో నిల్వలు ఉన్నట్టు తేలడంతో ప్రస్తుతం మైనింగ్ లీజుల అనుమతుల ప్రక్రియను ప్రారంభించింది.
⇒ గతంలో నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ (ఎన్‌ఎంఈటీ) నిధులతో తెలంగాణతోపాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో సున్నపురాయి అన్వేషణ ప్రాజెక్టులను టీజీఎండీసీ పూర్తి చేసింది. కేవలం అన్వేషణకే పరిమితం కాకుండా సున్నపురాయి గనులను లీజుకు తీసుకోవాలని సంస్థ భావిస్తోంది. ఒడిశాలోని కొన్ని సున్నపురాయి క్వారీలను లీజుకు తీసుకోవడంపై ఆసక్తి చూపుతున్న టీజీఎండీసీ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తోంది.
⇒ ఎన్‌ఎంఈటీ నిధులతో మాంగనీస్, మాలిబ్డినం అన్వేషణ కార్యకలాపాలు కూడా చేపట్టనుంది.
⇒ రాబోయే రోజుల్లో రోడ్ మెటల్‌కు భారీ డిమాండ్ ఉంటుందని టీజీఎండీసీ అంచనా వేస్తోంది. రంగారెడ్డి జిల్లా బండ రావిర్యాలలో రోడ్‌మెటల్ క్వారీయింగ్ చేపట్టేందుకు టీజీఎండీసీ సన్నద్ధమవుతోంది. ఇతర కార్యకలాపాల ద్వారా ఆదాయం పెంచుకునే ప్రణాళికలపై కసరత్తు జరుగుతున్నట్టు సంస్థ ఎండీ సుశీల్ కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment