పంజగుట్ట: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ కేసు పెట్టిన బాధితురాలే తనను బెదిరించి ఆ కేసులు పెట్టించారని, 139 మందిలో చాలామందికి ఈ కేసుతో సంబంధం లేదని పేర్కొంది. అంతేకాకుండా తనను ఓ ప్రముఖ టీవీ యాంకర్, ఓ సినీ హీరో కూడా అత్యాచారం చేశారని గతంలో చెప్పిన ఆమె.. వారికి ఈ కేసుతో సంబంధం లేదని స్పష్టంచేసింది. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె విలేకరులతో మాట్లాడింది. రాజారెడ్డి అలియాస్ డాలర్‌భాయ్.. తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించడంతో పాటు అత్యాచారం చేసి ఈ కేసుతో సంబంధం లేని వారి పేర్లు రాయించాడని చెప్పింది. వారిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు యత్నించాడని, అతడిపై కూడా త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు పేర్కొంది.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ.. కర్ణునికి కవచకుండలం ఎంత ముఖ్యమో.. ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ యాక్ట్ అంతే ముఖ్యమన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఆ కేసులు దుర్వినియోగం కావడం బాధాకరమన్నారు. ఓ గిరిజన బాలికపై 139 మంది అత్యాచారం చేశారనగానే తాను స్పందించకపోవడం పట్ల పలువురు విమర్శలు కూడా చేశారని, బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరించడం కోసమే ఈ జాప్యం జరిగిందని తెలిపారు. ఆమెను విచారించగా, 139 మందిలో దాదాపు 30 శాతం మంది పదేళ్లలో అత్యాచారం చేశారని, మరికొందరు మానసికంగా వేధించారని చెప్పినట్టు వివరించారు.
టీవీ, సినీ రంగానికి చెందిన వారికి కేసుతో సంబంధం లేదని, మాజీ ఎంపీ పీఏ మానసికంగా వేధించినట్లు మాత్రమే తెలుసుకున్నామన్నారు. అసలు బాధితురాలు ఇలా కావడానికి ముఖ్య కారణం విద్యార్థి సంఘం నాయకుడని.. అతన్ని, ఆశ్రయం కల్పించినట్లు నటించి మోసం చేసిన డాలర్ భాయ్‌ని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మహిళాసంఘాల నాయకులు సంధ్య, సజయ, విమలక్క, తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం అధ్యక్షుడు కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment