తిరుపతి కన్నయ్య చిట్టి (ఫైల్ ఫొటోలు)
గొల్లపల్లి (వెల్గటూర్): స్కూటీపై భార్య, ముగ్గురు పిల్లలతో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారి వాహనాన్ని లారీ డీకొట్టింది. ఈ ఘటనలో ఇంటి యజమాని, ఇద్దరు పిల్లలు మరణించగా, భార్య కుమారుడు గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పాశిగామ శివారులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కోడిపుంజుల తిరుపతి (38) ఇళ్లకు మార్బుల్స్ వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతడికి భార్య మనోజా, కొడుకులు ఆదిత్య(9), కన్నయ్య(1), కూతురు చిట్టి (1) ఉన్నారు. మనోజా తల్లి మూడు నెలల క్రితం చనిపోయింది. మూడు నెలల కార్యక్రమం కోసం కుటుంబాన్ని తీసుకుని స్కూటీపై అత్తగారి ఊరైన ధర్మపురి మండలం దమ్మన్నపేటకు వెళ్లారు. కార్యక్రమం ముగిశాక సాయంత్రం ఐదుగురూ ఇంటికి బయల్దేరారు. ఊరు చేరేందుకు మరో ఐదు కిలోమీటర్ల దూరంలో వెల్గటూరు మండలం పాశిగామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న హరితహోటల్ వద్దకు రాగానే వెనకాలే వస్తున్న లారీ స్కూటీని ఓవర్‌టేక్ చేస్తూ ఢీకొట్టింది. అందరూ రోడ్డుపై పడిపోయారు. లారీ వీరిపైనుంచి పోవడంతో చిట్టి, కన్నయ్య అక్కడికక్కడే చనిపోయారు.
తిరుపతి నడుం పైనుంచి లారీ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జయ్యింది. మనోజా రెండు కాళ్లు విరిగాయి. ఆదిత్య రోడ్డుకు కొద్ది దూరంలో పడడం తో స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ధర్మపురి సీఐ కోటేశ్వర్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నాడు. అపస్మారకస్థితిలో ఉన్న తిరుపతి, మనోజాను 108లో జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఆదిత్యను సీఐ తన వాహనంలో ఆస్పత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతూ తిరుపతి మృతిచెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనం దొరకలేదని, సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు సీఐ వెల్లడించారు. కాగా, గుంతలను తప్పించబోయే క్రమంలోనే వేగంగా వస్తున్న లారీ ఢీకొని ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment