భూపాలపల్లిలో టవర్‌ఎక్కిన మధుసూదనాచారి మద్దతుదారులు
భూపాలపల్లి రూరల్/ మెదక్/ తరిగొప్పుల/ స్టేషన్‌ఘన్‌పూర్: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే టికెట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందంటూ జరుగుతున్న ప్రచారంతో రగడ మొదలైంది. అసమ్మతి లొల్లి మరింతగా ముదురుతోంది. తమ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ పలుచోట్ల.. ఇతర నేతలకు ఇవ్వాలంటూ మరికొన్నిచోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. నియోజకవర్గాల్లో ఆయా నేతల అనుచరులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు.
మధుసూదనాచారికే టికెట్ ఇవ్వాలంటూ..
భూపాలపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ కేటాయిస్తున్నట్టు ప్రచారం జరగడంతో.. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వర్గం ఆదివారం ఆందోళనకు దిగింది. మధుసూదనాచారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు మెరుగు శ్రీకాంత్, పూర్ణయాదవ్, పృథ్వీ తదితరులు సెల్‌ఫోన్ టవర్ ఎక్కారు.
మరికొందరు కార్యకర్తలు ఇక్కడి అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మధుసూదనాచారికి అన్యాయం చేయవద్దని కోరారు. గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ ఇస్తే.. సుమారు 200 మంది ఉద్యమకారులం నామినేషన్లు వేసి బరిలో దిగుతామని, గండ్రను ఓడిస్తామని హెచ్చరించారు. పోలీసులు, నేతలు అక్కడికి చేరుకుని టవర్ ఎక్కిన వారితో మాట్లాడి కిందికి దింపారు.
పద్మా దేవేందర్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ..
మెదక్ బీఆర్‌ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి ఇవ్వొద్దంటూ మైనంపల్లి రోహిత్ వర్గీయులు ఆదివారం పట్టణంలో ధర్నాకు దిగారు. అధిష్టానం ఆదేశాల మేరకే యువ నాయకుడు రోహిత్ ‘సోషల్ సరీ్వస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్‌ఎస్)’ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, టికెట్ ఆయనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. పద్మా దేవేందర్‌రెడ్డికి టికెట్ ఇస్తే.. యువత ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వదన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట మాజీ ఎంపీపీ అరుణ, సర్పంచ్ రాజిరెడ్డి, ఎంఎస్‌ఎస్‌ఓ ఆర్గనైజింగ్ సభ్యులు బొజ్జ పవన్, బోసు, మేడి గణేశ్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
ముత్తిరెడ్డి, జెడ్పీ చైర్మన్ వర్గాల మధ్య ఘర్షణ
జనగామ బీఆర్‌ఎస్ టికెట్ విషయంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వర్గాల మధ్య ఇప్పటికే ఘర్షణ కొనసాగుతుండగా ఆదివారం అది మరింత పెరిగింది. నియోజకవర్గంలోని తరిగొప్పుల మండలం మరియపురంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బీరెడ్డి జార్జిరెడ్డి నివాసంలో మండల ప్రజా ప్రతినిధులతో జెడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డి సమావేశమయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అనుచరులు బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పింగళి జగన్మోహన్‌రెడ్డి, కో–ఆర్డినేటర్ జొన్నగోని కిష్టయ్య, గ్రామ అధ్యక్షుడు అంకం రాజారాం, యూత్ అధ్యక్షుడు మల్యాల సు«దీర్ తదితరులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.
టి.రాజయ్యకే టికెట్ ఇవ్వాలంటూ..
బీఆర్‌ఎస్ స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ టికెట్‌ను ఈసారి కడియం శ్రీహరికి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గం ఆందోళనకు దిగింది. ‘స్థానికుడైన రాజయ్యకే మళ్లీ టికెట్ ఇవ్వాలి. వలసవాద రాజకీయాలు వద్దు. కడియం గోబ్యాక్’అంటూ రాజయ్య అనుచరులు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ధర్నా చేశారు.
ఇది కూడా చదవండి: ఫొటో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment