అటవీ ప్రాంతంలో పులి అడుగు జాడలు పరిశీలిస్తున్న అటవీ అధికారులు
సాక్షి, మంచిర్యాల(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని గుడిపేట–నంనూర్ అటవీ శివారు ప్రాంతంలో గేదెల మందపై చిరుత పులి దాడి చేసి ఓ గేదెను గాయపరచినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల మేరకు సోమవా రం అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో విస్తృత తనిఖీలు చేశారు. ఆదివారం గుడిపేట–నంనూర్ అటవీ శివారులోని గేదెల మందపై జరిగిన దాడి ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాల్లో చిరుతపులి అడుగుజాడల కోసం పరిశీలించారు. అయితే అవి చిరుత పులి అడుగులు కాదని.. చిరుత అడుగులు చిన్నవిగా ఉంటాయని లక్సెట్టిపేట అటవీరేంజ్ అధికారి స్వామి తెలిపారు.
నాగారం, ర్యాలీ అటవీ ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతం, గుట్టలు, గుహలు ఉన్నాయని ఈ క్రమంలోనే ఇక్కడ పులి తలదాచుకుంటుందని పేర్కొన్నారు. అడుగుల పరిశీలనలో డెప్యూటీ అటవీ రేంజ్ అధికారి జమీల్ అహ్మద్, ఎఫ్‌ఎస్‌ఓ అతావుల్లా, బీట్ అధికారులు రత్నాసింగ్, రాజమణి, తిరుపతి పాల్గొన్నారు.
అంతా అప్రమత్తంగా ఉండాలి
గుడిపేట, ర్యాలీ, నాగారం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు ప్రాథమిక సర్వే ప్రకారం స్పష్టంగా తెలుస్తోందని లక్సెట్టిపేట అటవీ రేంజ్ అధికారి నాగవత్ స్వామి తెలిపారు. ఈ క్రమంలో గుడిపేట, నంనూర్ గ్రామ పరిసరాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతులు పశువుల్ని మేతకు అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా చూడాలని తెలిపారు. పులి దాడిలో మృతి చెందితే పశువైద్యాధికారుల నిర్ధారణ మేరకు సంబంధిత రైతులకు నాలుగు రోజుల్లో నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. పులికి హాని జరగకుండా చూడాలని స్పష్టంగా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment