వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు కలవరపెడుతున్నాయి. ఒకపక్క ప్రజలు జలుబు, దగ్గుతో బాధపడుతుండగా.. మరోవైపు విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటివి ప్రాణాలు తీస్తున్నాయి. ప్రబలుతున్న వ్యాధులపై సాక్షి ప్రత్యేక కథనం.
– కుత్బుల్లాపూర్
► కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో చెత్తా చెదారాలకు తోడు ఆయా ప్రాంతాల్లో పందులు, దోమల బెడద అధికంగా ఉంది.
► మలేరియా సిబ్బంది తూతూ మంత్రంగా కాలనీల్లో పర్యటిస్తూ పనులు చేస్తున్నా దోమలు విజృంభిస్తున్నాయి.
► దీంతో అనేకమంది డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు.
► ఓ యువ డాక్టర్ ప్రస్తుతం డెంగీతో మరణించడంతో స్థానికంగా ఇప్పుడు కలకలం రేపుతోంది.
► నిజామాబాద్‌కు చెందిన అర్పిత రెడ్డి (32) జీడిమెట్ల డివిజన్ మీనాక్షి ఎస్టేట్స్‌లో ఉంటూ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోంది. 5 రోజుల క్రితం త్రీవమైన జ్వరం రావడంతో నగరంలోని గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించగా డెంగీగా తేలింది. చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మృత్యువాత పడడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈమెకు ఒక కూతురు ఉంది. ఓ డాక్టర్ విధంగా డెంగీతో చనిపోవడం స్థానికంగా కలకలం రేపింది.
పత్తాలేని వైద్యాధికారులు...
చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి!
► ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలం మురికివాడల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాల్సిన వైద్య ఆరోగ్య అధికారులు పత్తా లేకుండా పోవడంతో రోగాలు విజృంభిస్తున్నాయి. ఒకవైపు విషజ్వరాలు సోకి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు అధికం అవుతోంది. స్థానికంగా పారిశుద్ధ్యం విషయంలో జంట సర్కిల్ వైద్యాధికారులు తమ పరిధి కాదన్నట్లు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గాజులరామారం సర్కిల్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ విభాగం పనితీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం ఫొటోలకే పరిమితం అన్నట్లుగా స్థానికంగా విధులు నిర్వహించే వైద్యాధికారి తీరుపై పలు మురికివాడ ప్రాంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ కేసులు..
► కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే కరోనాతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో విష జ్వరాలు సోకడం వల్ల మరింత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు వాపోతున్నారు. మీనాక్షి ప్రాంతానికి చెందిన ఓ మహిళ సుచిత్ర సమీపంలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఐసీయూలో చికిత్స పొందుతుండగా, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని ఇటీవల పేట్‌బషీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయట పడింది.
Comments
Please login to add a commentAdd a comment