నందిగామ శివారులో నిర్వహిస్తున్న లెడ్డు బట్టీ నుంచి పొగలు..
పచ్చని పంట పొలాల్లో కాలుష్యం చిచ్చు పెట్టే పరిశ్రమలు ఓ వైపు.. అర్ధరాత్రి అయితే చాలు భగభగ మండే లెడ్డు బట్టీల కాలుష్యం మరో వైపు .. వెరసి మండల ప్రజలు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఎలాంటి అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న లెడ్డు బట్టీలు.. నిబంధనలను తుంగల్లో తొక్కి యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమల ఆగడాలను అడ్డుకోవాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
– నందిగామ
మండల కేంద్రమైన నందిగామతో పాటు జంగోనిగూడ, నర్సప్పగూడ, చేగూరు, వీర్లపల్లి, మోత్కులగూడ, అప్పారెడ్డిగూడ, మేకగూడ, రంగాపూర్ తదితర గ్రామాలలో సుమారు 100 పరిశ్రమల వరకు ఉన్నాయి. ఇందులో స్పాంజ్ ఐరన్, ఐరన్, టెక్స్‌టైల్స్, ఫార్మ, ప్లైఉడ్, అల్యూమినీయం, నూనె డబ్బల తయారీ, ప్యాకింగ్ కవర్స్ తదితర పరిశ్రమలు ఉన్నాయి.
విచ్చలవిడిగా లెడ్డు బట్టీలు..
►జంగోనిగూడ అక్రమ లెడ్డు బట్టీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
►జంగోనిగూడ నుంచి తీగాపూర్ కు వెళ్లే రహదారిలో అక్రమంగా మూడు లెడ్డు బట్టీలను ఏర్పాటు చేశారు. అవి రాత్రయితే చాలు బట్టీలు వెలుగుతూనే ఉంటాయి.
►అయ్యప్ప స్వామీ దేవాలయం సమీపంలోని పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో అక్రమ లెడ్డు బట్టీలు నడిపిస్తున్నారు.
చదవండి: Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..?
లెడ్డు బట్టీలతో ఘాటైన వాసనలు..
లెడ్డు బట్టీలలో పాడైపోయిన బ్యాటరీలను పగులగొట్టి అందులోని మెటీరియల్ సేకరిస్తారు. వీటిని బోగ్గుతో కాల్చి కరగబెట్టి లెడ్డును వెలికి తీస్తారు. ఈ ప్రక్రియలో బ్యాటరీలను బొగ్గుతో కాలుస్తున్న క్రమంలో విపరీతమైన నల్లటి పొగ, దుర్వాసన వెదజల్లుతోంది. ఈ పొగ సమీపంలోని గ్రామాలు, వ్యవసాయ పంటపొలాలలో పడి ఆ ప్రాంతమంతా కాలుష్యంతో మునిగిపోతోంది.
చేగూరులో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగ
రాత్రి వేళల్లోనే..
అక్రమ లెడ్డు బట్టీలు రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు నిర్వహిస్తుంటారు. జంగోనిగూడ శివారులోని ఓ లెడ్డు బట్టిలో గతంలో జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అంతేకాకుండా రాత్రి వేళ్లలో మాత్రమే కొనసాగుతున్న లెడ్డు బట్టిలలో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటితో పాటు వీర్లపల్లి, నందిగామ, నర్సప్పగూడ తదితర గ్రామాల శివార్లలో ఉన్న ఐరన్ పరిశ్రమల వల్ల వీపరీతమైన పొగ, దుమ్ము ధూళీ రావడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేగూరుకు రాత్రి వేళల్లో వెళ్లాలంటే విపరీతమైన పొగతో రోడ్డు సైతం కనపడని దుíస్థితి నెలకొంటోంది.
చదవండి: చెరువులో ఈతకొడుతూ.. టీఆర్‌ఎస్ నాయకుడి కన్నుమూత
మృతి చెందుతున్న మూగజీవాలు
స్పాంజ్ ఐరన్ పరిశ్రమ వెదజల్లే కాలుష్యం కారణంగా పచ్చని గ్రాసంపై నల్లటి బూడిద కణాలు పడి వాటిని తిన్న పశువులు మృత్యువాత పడుతున్నాయి.
ఫిర్యాదు చేసినా పట్టించుకోరు
నర్సప్పగూడ, వీర్లపల్లి గ్రామాల మధ్య వెలసిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమల ద్వారా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళలో ఆయా పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల పంట పొలాలతో పాటు గ్రామంలోని ఇళ్లపై నల్లటి బూడిద పడుతోంది. ఈ విషయమై సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
– గోవిందు అశోక్ కుమార్, సర్పంచ్, నర్సప్పగూడ
చర్యలు చేపడతాం
స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు వీపరితమైన కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ఇటీవల ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని హెడ్ ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లాను. రెండు మూడు రోజులలో ల్యాబ్ టెక్నిషియన్స్‌ను తీసుకొని పరిశీలిస్తాం. నిబంధనలకు విరుద్ధంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం.
– దయానంద్, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి
Comments
Please login to add a commentAdd a comment