వికారాబాద్, పరిగి: ‘కేసీఆర్ పుర్రెలో పురుగు తిరిగింది.. ఎన్నికలకు పోవాలనుకుంటుండు.. డిసెంబర్‌లోనే ఎన్నికల నగారా మోగుతుంది. మరో 11 నెలల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి నేనే నాయకత్వం వహిస్తా..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం పరిగిలో జరిగిన కార్యక్రమంలో, ఏఐసీసీ డేటా అనలిటిక్స్ విభాగం చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తితో కలిసి కార్యకర్తలకు రేవంత్ పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్లే, కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నోళ్లే ప్రభుత్వ సం క్షేమ పథకాలు పొందటంలో ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఉద్యమకారులు, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.
గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తాం
గాంధీ కుటుంబాన్ని చూస్తే మోదీకి తడిసిపోతుందని, అం దుకే పాత కేసులు తిరగదోడి ఈడీ ద్వారా సోనియా, రాహుల్‌లకు నోటీసులు ఇప్పిస్తున్నారని రేవంత్ విమర్శిం చారు. గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తామని, బీజేపీని బట్టలూడదీసి కొడతామన్నారు. సోనియా, రాహుల్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈడీ నోటీసులకు నిరసనగా ఈ నెల 13న సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
డిజిటల్ కార్డులు పరిగిలోనే మొదలు
సోనియా, రాహుల్‌ల తర్వాత పరిగిలోనే మొదటగా డిజిటల్ కార్డులు అందజేస్తున్నామని రేవంత్ తెలిపారు. కార్డు ఉన్నవారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ఉపయోగాలున్నాయని స్పష్టం చేశారు. పరిగిలో 50 వేల మెజార్టీతో రామ్మోహన్‌రెడ్డి గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ‘పేదలకు భూములు ఎవరు పంచారు? ఇంది రమ్మ ఇళ్లు ఎవరిచ్చారు? మొదట రుణమాఫీ చేసిందెవరు? ఆరోగ్యశ్రీ ఎవరు తెచ్చారు? బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా...?’ అంటూ గుర్తు చేశారు.
డిజిటల్ కార్డుతో ఢిల్లీ నుంచే పర్యవేక్షణ
డిజిటల్ కార్డు ద్వారా పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచే ప్రతి కార్యకర్తను చూస్తుందని ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. కార్యకర్త పనితీరును కూడా దీనిద్వారా అంచనా వేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment