పంజగుట్ట చౌరస్తాలో వైఎస్ విగ్రహం వద్ద నివాళులర్పించిన పొన్నాల, రేవంత్, అంజన్‌కుమార్ యాదవ్
సాక్షి, హైదరాబాద్/పంజ గుట్ట: దేశానికి ఆదర్శవంత మైన పాలన అందించిన మహనీయుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ దీర్ఘ కాలం ప్రజాజీవితంలో ఉన్న నాయకుడని, ఆయన మర ణం ఒక్క కాంగ్రెస్‌పార్టీకే కాక, తెలుగు ప్రజలందరికీ తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామన్నారు.
జీవితాంతం కాంగ్రెస్ సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా పాటించి ప్రజల అభీష్టమే లక్ష్యంగా పరిపాలన అందించిన వైఎస్సార్ ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదే విధంగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహం వద్ద సహచర నేతలు, కార్య కర్తలతో కలిసి నివాళులర్పించారు.
రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ తర్వాత పేదలకు అంతటిస్థాయిలో సంక్షేమపథకాలు అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని రేవంత్ అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు పేదలకు ఎంతో ఉపయోగ పడ్డాయని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీతో పేదలందరికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించారని, మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని కొనియాడారు.
నాడు వైఎస్ చేపట్టిన జలయజ్ఞం వల్లే వ్యవసాయం లాభసాటిగా మారిందని స్పష్టం చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే దేశంలో యూపీఏ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు కుమార్‌రావు, కోదండరెడ్డి, ఈ.అనిల్, అనిల్ కుమార్ యాదవ్, సంగిశెట్టి జగదీశ్, మల్రెడ్డి రాంరెడ్డి, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయి కుమార్,కల్వ సుజాత, పద్మ వరలక్ష్మి, కత్తి కార్తీక, బొల్లు కిషన్, నగేశ్ ముదిరాజ్, కార్పొరేటర్ పి.విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment