సాక్షి, హైదరాబాద్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’తెలంగాణలో ఫుల్ జోష్‌గా సాగేలా టీపీసీసీ పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. ఈనెల 23న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణానదిపై ఉన్న బ్రిడ్జిపై స్వాగతం జనజాతరను తలపించింది.
తెలంగాణలో తనకు లభించిన ఘన స్వాగతం వీడియోను స్వయంగా రాహుల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని రాహుల్ తన యాత్రకు మూడు రోజులు విరామమిచ్చి ఢిల్లీకి వెళ్లారు. గురువారం నుంచి పునః ప్రారంభం కానున్న యాత్ర ఆసాంతం తొలిరోజు ఊపునే కొనసాగించాలని టీపీసీసీ కృతనిశ్చయంతో ఉంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జనసమీకరణ కమిటీ చైర్మన్ మహేశ్వర్‌రెడ్డి, యాత్రీస్ చైర్మన్ పొన్నం ప్రభాకర్ తదితర ముఖ్య నాయకులు యాత్ర నిర్వహణపై పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు.
యాత్ర ఏ గ్రామం నుంచి సాగినా.. చుట్టుపక్కల నియోజకవర్గాలకు చెందిన నాయకులు జనాలను పెద్ద ఎత్తున సమీకరించి యాత్రకు పంపేలా పార్టీ దిశానిర్దేశం చేసింది. రాహుల్ యాత్ర రాష్ట్రంలో ముగిసే ఏడో తేదీ వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాది మంది ఆయన వెంట నడిచేలా ప్లాన్ చేశారు.
ప్రతి రోజు కొందరు నేతలకే పూర్తి బాధ్యతలు..
ఈ నెల 23న రాష్ట్రంలోకి ప్రవేశించిన రాహుల్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులు హాజరై స్వాగతం పలికినా, ప్రధానంగా జన సమీకరణ జరిగింది మక్తల్, నారాయణపేట, గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాల నుంచే. ఏఐసీసీ కార్యదర్శి సి. వంశీచందర్ రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తొలిరోజు పాదయాత్ర నిర్వహణ ఏర్పాట్లు చూసుకున్నారు.
ఇదే తరహాలో ప్రతిరోజు ఇద్దరు నాయకులే ప్రధాన భూమిక పోషించేలా ప్లాన్ చేశారు. జన సమీకరణ మొదలుకొని నిర్వహణ ఏర్పాట్ల కోసం 14 కమిటీలు ఏర్పాటు చేసినా, ఈ కమిటీలన్నింటిని సమన్వయం చేసుకుంటూ ఏ లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యతను ఆ నాయకులకు అప్పగించారు. నవంబర్ 1న హైదరాబాద్‌లో సాగే పాదయాత్రకు మాత్రం ముఖ్య నాయకులంతా నిర్వాహకులుగానే వ్యవహరించనున్నారు.
తేదీల వారీగా యాత్ర నిర్వాహక బాధ్యతలు వీరికే..
27న : మక్తల్ నుంచి పునః ప్రారంభమయ్యే పాదయాత్ర నిర్వహణ బాధ్యతలు డీఏసీ చైర్మన్ జి.చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌కు అప్పగించారు.
28న : గడ్డం ప్రసాద్‌కుమార్, టి.రాంమోహన్‌రెడ్డి
29న : పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
30న : కె.జానారెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
31న : భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి నవంబర్ 1: ఎ.రేవంత్‌రెడ్డి, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, నందికంటి శ్రీధర్, సీతక్క, పి.బలరాంనాయక్, కొండా సురేఖ, దొంతి మాధవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి
2న: దామోదర రాజనర్సింహ, టి.జగ్గారెడ్డి
3న: జె.గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్
4న : బ్రేక్
5న: టి.జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్
6న: డి.శ్రీధర్‌బాబు, కె.ప్రేంసాగర్‌రావు
7న: ఎ.మహేశ్వర్‌రెడ్డి, రామారావు పటేల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment