రాహుల్‌ పాదయాత్ర.. వయా గాంధీభవన్‌  | TPCC Plans Bharat Jodo Trip Via Gandhi Bhavan | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ గుండా భారత్‌ జోడో యాత్రకు టీపీసీసీ ప్లాన్‌ 

Published Sat, Oct 1 2022 3:38 AM | Last Updated on Sat, Oct 1 2022 3:38 AM

TPCC Plans Bharat Jodo Trip Via Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగనున్న రాహుల్‌గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర పూర్తిస్థాయిలో సద్వినియోగం కోసం ఏఐసీసీ పంపిన రూట్‌మ్యాప్‌కు టీపీసీసీ భారీ మార్పులు చేసింది. హైదరాబాద్‌ గుండా గాంధీభవన్‌ మీదుగా యాత్రను తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేస్తోంది. యాత్ర షెడ్యూల్‌పై చర్చించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీగౌడ్, బలరాంనాయక్, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, మహేశ్‌కుమార్‌గౌడ్, అజారుద్దీన్, కోదండరెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి, రేణుకాచౌదరి, చిన్నారెడ్డి తదితరులు హాజరై ఏఐసీసీ ఇచ్చిన షెడ్యూల్‌పై చర్చించారు.

ఏఐసీసీ ఇచ్చిన రూట్‌ ప్రకారం.. మక్తల్, నారాయణపేట, కొడంగల్, తాండూరు, వికారాబాద్, జహీరాబాద్, జుక్కల్‌ మీదుగా యాత్ర వెళ్తే ప్రయోజనం ఉండదని భావించిన టీపీసీసీ ప్రత్యామ్నాయ రూట్‌మ్యాప్‌ రూపొందించి ఏఐసీసీకి పంపింది. రాష్ట్ర పార్టీలోని ముఖ్యనేతలందరూ చర్చించి ఏకగ్రీవ ఆమోదంతో రూట్‌ మ్యాప్‌ను మళ్లీ పంపాలని ఏఐసీసీ స్పష్టం చేసింది. దీంతో టీపీసీసీ ముఖ్యనేతలు.. మక్తల్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్‌ మీదుగా శంషాబాద్‌ తర్వాత పాతబస్తీ మీదుగా గాంధీభవన్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, లింగంపల్లి, పటాన్‌చెరు మీదుగా ముత్తంగి వెళ్లాలనే ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

ఈ యాత్ర నిర్వహణకు ప్రచార, మీడియా, ఆహార, రవాణా, వాలంటీర్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌కాంగ్రెస్‌ నుంచి 200 మంది చొప్పున వాలంటీర్లతో యాత్ర జరపాలని నిర్ణయించింది. అలాగే నగరం గుండా రాహుల్‌ యాత్రకు అనుమతి కోరుతూ డీజీపీకి శనివారం వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది.  

టీపీసీసీ ప్రతిపాదనలివే.. 

  • శంషాబాద్‌ నుంచి పాతబస్తీ మీదుగా గాంధీభవన్, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పటాన్‌చెరు మీదుగా ముత్తంగి, సంగారెడ్డికి యాత్ర వెళుతుంది.  ∙ఏఐసీసీ ఇచ్చిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం 355 కిలోమీటర్లు, 13 రోజుల యాత్ర జరగాల్సి ఉంది. అయితే టీపీసీసీ తాజాగా ఆమోదించిన మ్యాప్‌ ప్రకారం అది 380 కిలోమీటర్లు, 14 రోజులు అవుతోంది.  ∙దారిలో చిలుకూరు బాలాజీ టెంపుల్, షాద్‌నగర్‌ దర్గా, మెదక్‌ చర్చి, నార్సింగ్‌ రూట్‌లో వస్తే ఆరె మైసమ్మ టెంపుల్, సిటీలో నుంచి అయితే చార్మినార్‌ను రాహుల్‌ సందర్శిస్తారు.  
  • ఇందిరాగాంధీ వర్ధంతి రోజున (అక్టోబర్‌ 31) బీహెచ్‌ఈఎల్‌ దగ్గర మహిళలతో బహిరంగసభ ఏర్పాటు చేస్తారు.  ∙విద్యార్థి నిరుద్యోగ, బీసీ, మహిళా, దళిత, గిరిజన డిక్లరేషన్లలో ఒక దానిని రాహుల్‌ ప్రకటిస్తారు.  
  • కర్ణాటక నుంచి రాహుల్‌ తెలంగాణలోకి ప్రవేశించే కృష్ణ మండలం గూడవల్లూరు వద్ద భారీ స్వాగతం పలకాలి. ఆ తర్వాత మునుగోడు ప్రజలతో శంషాబాద్‌ దగ్గర, ఆ తర్వాత జోగిపేటలో భారీ సభలు నిర్వహిస్తారు.  ∙ప్రతి రెండున్నర కిలోమీటర్లకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున నేతలు రాహుల్‌తో నడుస్తారు. రోజుకో పార్లమెంట్‌ నియోజకవర్గం నేతలతో రాహుల్‌ భేటీ అవుతారు.
  • పాలమూరు వర్సిటీ, జేఎన్‌టీయూ విద్యార్థులతో రాహుల్‌ ముఖాముఖి సమావేశమవుతారు. విద్యార్థినులు, యువతులతో ప్రత్యేక భేటీ ఉంటుంది. ఇటీవల కలుషిత ఆహారంతో అస్వస్తతకు గురైన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులనూ కలుస్తారు.  ∙అక్టోబర్‌ 4న జరిగే సమావేశంలో చర్చించి రూట్‌మ్యాప్‌ను ఖరారు చేస్తారు. ఆ తర్వాత రాహుల్‌ ప్రత్యేక భద్రతా సిబ్బంది అనుమతి మేరకు తుది షెడ్యూల్‌ను తయారు చేస్తారు.  

ఎన్నికల యాత్ర కాదు: రేవంత్‌
టీపీసీసీ ముఖ్యుల భేటీ తర్వాత ఉత్తమ్, యాష్కీ, శివసేన, బల్మూరి వెంకట్‌తో కలిసి రేవంత్‌ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ యాత్ర రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశామని, దీన్ని ఏఐసీసీ ఆమో దానికి పంపుతామన్నారు. రాహుల్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ఎన్నికల యాత్ర కాదని, దేశ ప్రయోజనాల కోసం చేస్తున్న బృహత్తర ప్రయత్నమని చెప్పా రు. ఈ దేశాన్ని బలమైన దేశంగా నిలబెట్టేందుకు రాహుల్‌తో తెలంగాణ సమాజం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఎవరున్నారన్న దానిపై మంత్రి కేటీఆర్‌తో చర్చించేందుకు సిద్ధమని రేవంత్‌ వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement