పీసీసీ అధ్యక్షుడిగా భరోసా ఇస్తున్నా..: మహేశ్‌గౌడ్ ప్రకటన
ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షల విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. రిజర్వ్‌డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్న వాదన పచ్చి అబద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా తాను భరోసా ఇస్తున్నానని, మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి నష్టం జరగలేదని, భవిష్యత్తులో కూడా ఎలాంటి నష్టం జరగదని చెప్పారు. ఆదివారం గాం«దీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఇతర నేతలతో కలసి మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు గ్రూప్–1 మెయిన్స్ విషయంలో నిరుద్యోగులను రెచ్చగొడుతూ.. లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు.
అపోహలు వద్దు
‘పీసీసీ అధ్యక్షుడిగా, బీసీ వర్గాలకు చెందిన వ్యక్తిగా గ్రూప్–1 అభ్యర్థులందరికీ భరోసా ఇస్తున్నా. మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు అన్యాయం జరగదు. ఇది పార్టీ, ప్రభుత్వ పక్షాన మేమిస్తున్న భరోసా. అన్ రిజర్వ్‌డ్ మెరిట్ జాబితాలోకి వచ్చిన అభ్యర్థులను మళ్లీ రిజర్వ్‌డ్ కేటగిరీలో లెక్కించరు. మెరిట్ జాబితాలో ఎంపికైన రిజర్వ్‌డ్ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలోనే కొనసాగుతారు. రిజర్వ్‌డ్ పోస్టుల్లో తక్కువ పడితేనే ఇతర అభ్యర్థులను తీసుకుంటారు. అందుకే సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అసలు నష్టమే జరగదు. అర్థం చేసుకోవాలి’అని మహేశ్‌గౌడ్ వివరించారు.
విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి
గాం«దీభవన్ సేకరించిన సమాచారం ప్రకారం.. మొత్తం అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులే 75 శాతం ఉంటారని మహేశ్‌గౌడ్ చెప్పారు. కానీ బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కై పరీక్షల విషయంలో లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్.. పదేళ్లలో ఎన్ని గ్రూప్–1 ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన బీఆర్‌ఎస్‌ది చిత్తశుద్ధా? పది నెలల్లో 50వేల ఉద్యోగాలిచ్చిన కాంగ్రెస్‌ది చిత్తశుద్ధా అన్నది నిరుద్యోగులు ఆలోచించాలన్నారు. ఇంటర్ ఫలితాలను కూడా సక్రమంగా ఇవ్వలేని బీఆర్‌ఎస్ తమకు బుదు్ధలు చెప్పాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. దేశంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ.. ఎన్ని ఉద్యోగాలిచ్చిందో బండి సంజయ్ చెప్పాలని, ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు ధర్నాలు చేస్తున్నారో చెప్పాలని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment