
గురువారం గాంధీ భవన్‌లో రాజీవ్ గాంధీ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, పొన్నాల తదితరులు
సాక్షి, హైదరాబాద్: అనూహ్య పరిస్థితుల్లో ప్రధానిగా పదవి చేపట్టిన రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేశారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉండాలనే ఆకాంక్షతో దేశాభివృద్ధికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయన దని కొనియాడారు. గురువారం మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాజీవ్ చిత్రపటానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పూలమాలలు వేసి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ మాజీనేత జానారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ నేతలు అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, దాసోజు శ్రవణ్, ఉజ్మా షకీర్, ఫిరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ 40 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమర్థంగా పాలించారని అన్నారు. దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ అభివృద్ధికి ఆయనే కారణమని పేర్కొ న్నారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి చేసిన సేవలను మోదీ ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. రాజీవ్ బాటలో నడుస్తూ జీహెచ్ ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment