సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కుంగిపోయిందని, ఇక లేవలేదని అవాకులు, చెవాకులు పేలిన పార్టీలకు బుద్ధిచెప్పే విధంగా 2023లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోబోతున్నామని ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2001లో కేసీఆర్ సిద్దిపేట ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, అప్పుడు కూడా చాలామంది నేతలు కాంగ్రెస్ పని అయిపోందని విమర్శించారని, కానీ, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో 2023లో జూన్, జూలై మధ్యలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలనాపగ్గాలు చేపట్టబోతోందని అన్నారు. ఉప ఎన్నికలు తమకు లెక్కకాదని స్పష్టం చేశా రు.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌తోపాటు కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించి గురువారానికి ఏడాది కావడంతో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీలో జూనియర్ అయినా, వయసులో చాలామంది సీనియర్ నేతలకన్నా చిన్నవాడినైన తనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ అధ్యక్షుడు రాహుల్‌పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని రేవంత్ అన్నారు. ప్రతీ ఒక్క నేతను కలుపుకొని ముందుకు సాగుతానని, సోనియా నిర్ణయించిన వ్యక్తిని పల్లకీలో మోసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతానని ఉద్వేగంగా పేర్కొన్నారు. తన పేరుతో సోషల్ మీడియాలో పార్టీ సీనియర్ నేతలపై కామెంట్లు పెట్టకూడదని, అలా ఎవరు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
45 లక్షల సభ్యత్వం.. ప్రతీ సభ సక్సెస్
పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహించిన ప్రతి ఒక్క సభను కార్యకర్తల కృషితో విజయవంతం చేసుకున్నామని రేవంత్ వెల్లడించారు. సోనియా అభినందించేలా 45 లక్షల డిజిటల్ మెంబర్‌షిప్ చేశామని, దేశంలోనే తెలంగాణ ఫస్ట్ అని అధిష్టానం కితాబు ఇచ్చిందన్నారు. తన లక్కీ నెంబర్ 9 అని, 99 మందితో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తెలగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని సీఎల్పీ నేత భట్టి విమర్శించారు.
పార్టీలో చేరిన ఎర్ర శేఖర్, బిల్యానాయక్...
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, నల్లగొండ జిల్లా దేవరకొండ టీడీపీ నేత బిల్యానాయక్ తమ అనుచరులతో గాంధీభవన్‌లో రేవంత్, భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు సుబ్బరామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరులు, ఫిర్జాదిగూడకు చెందిన బీజేపీ, మహేశ్వరం నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment