ఇక స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు | Training For Unemployed Engineering Students In IT Hub | Sakshi
Sakshi News home page

ఇక స్థానికంగానే ఐటీ ఉద్యోగాలు

Published Thu, Dec 3 2020 8:47 AM | Last Updated on Thu, Dec 3 2020 9:06 AM

Training For Unemployed  Engineering Students In  IT Hub  - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంజనీరింగ్‌ విద్యార్థులు, అర్హులైన నిరుద్యోగులకు ఐటీ హబ్‌ ద్వారా స్థానికంగానే ఉద్యోగాలు పొందే మహోన్నత అవకాశం లభించనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. నగరంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈ నెల 7వ తేదీన తనతో సహా నలుగురు రాష్ట్ర మంత్రులు ప్రారంభిస్తారని తెలిపారు. బుధవారం ఖమ్మం ఐటీ హబ్‌ను పరిశీలించిన అనంతరం ఆయన అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఐటీ ఉద్యోగాలకే ఈ హబ్‌ పరిమితం కాకుండా వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేలా నిరుద్యోగులకు నిరంతరం శిక్షణ ఇచ్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే తన క్యాంప్‌ కార్యాలయంలో నడుస్తున్న టాస్క్‌ను ఐటీ హబ్‌కు తరలిస్తున్నామని, ఎటువంటి  విద్యార్హత ఉన్నా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఆయా రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలో ఇది కార్యరూపం దాల్చుతుందని అన్నారు.

ఈ నెల 2న జరగాల్సిన మంత్రుల పర్యటన జీహెచ్‌ఎంసీ ఎన్నికల కారణంగా వాయిదా పడిందని, ఈ నెల 5న మంత్రుల పర్యటన వివరాలు అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేసుకున్న ఐటీ హబ్‌లో స్వల్ప మార్పులతో అదనంగా మరో అంతస్తు ఏర్పాటు చేశామని, మొదటి దశ పూర్తి చేసి వివిధ ఐటీ కంపెనీలకుగాను 425 సీట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసుకున్న ఐటీ హబ్‌లో ఇప్పటికే 16 కంపెనీలు భాగస్వాములయ్యాయని, ఇటీవలే నిర్వహించిన జాబ్‌మేళాకు విశేష స్పందన లభించిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 5వేల మందికి పైగా యువత జాబ్‌మేళాకు హాజరయ్యారని తెలిపారు. ఐటీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఇంజనీరింగ్‌ విద్యార్థులతోపాటు ఇంటర్మీడియట్, పతో తరగతి అర్హతపై కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తన సంకల్పమని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌ నగరంతో పోటీపడి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన ఆకాంక్ష అని, నగర ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఖమ్మం అభివృద్ధికి గుమ్మంగా నిలుస్తోందన్నారు.

ఈ ఏడాది కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి చొరవతో వందల కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నగరంలో నూతన హంగులతో అన్ని వసతులతో ఏర్పాటవుతున్న ఆర్టీసీ బస్టాండ్‌ను కూడా జనవరిలో ప్రారంభించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. నగరాభివృద్ధి, సుందరీకరణలో భాగంగా ఇప్పటికే సుమారు 30 కిలోమీటర్ల మేర రోడ్లను నాలుగు వరుసల రోడ్లుగా అభివృద్ధి చేసి.. డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమపద్ధతిన బాధ్యతాయుతంగా నగరాభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజలకు పునరావాసం కల్పించడంలో కూడా బాధ్యతగా వ్యవహరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ.కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్‌ డాక్టర్‌ జి.పాపాలాల్, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, ట్రెయినీ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఎస్‌బీఐటీ విద్యాసంస్థల చైర్మన్‌ జి.కృష్ణ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement