TRS Rajya Sabha Candidates.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు జరుగ నున్న మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ప్రకటించారు. బండాప్రకాశ్ ముదిరాజ్ రాజీనామాతో ఏర్పడిన ఖాళీ (ఉప ఎన్నిక)కు గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. సుమారు రెండేళ్ల పదవీకాలం ఉన్న ఈ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ను కేసీఆర్ ఎంపిక చేశారు.
ఇక వచ్చే నెల 21న ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసు కుంటున్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల స్థానంలో టీన్యూస్, నమస్తే తెలంగాణ దిన పత్రిక సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, ఫార్మా సంస్థ అధినేత బండి పార్థసారథిరెడ్డిల పేర్లను ఖరారు చేశారు. వారు ఆరేళ్లపాటు పదవిలో ఉం టారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపి కైన ముగ్గురు బుధవారం సాయంత్రం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారికి పార్టీ బీఫారాలు అందజేసి అభినందించారు. రాజ్యసభ ఉప ఎన్నిక స్థానానికి వద్దిరాజు రవిచంద్ర గురువారం నామినేషన్ వేయనున్నారు.
ఏ వర్గం నుంచి ఎందరు?
రాష్ట్రంలో మొత్తంగా ఏడు రాజ్యసభ స్థానాలు ఉండగా అందులో మూడు సీట్లకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారు కాబట్టి.. రాష్ట్ర శాసనసభలో పూర్తిబలమున్న టీఆర్‌ఎస్‌కే మూడు సీట్లు దక్కనున్నాయి. ఈ ముగ్గురినీ పరిగణనలోకి తీసుకుంటే.. రాష్ట్ర రాజ్యసభ సభ్యుల్లో వెలమ సామాజికవర్గం నుంచి జోగినపల్లి సంతోష్, దామోదర్‌రావు.. మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి కె.కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర.. రెడ్డి సామాజికవర్గం నుంచి కేఆర్ సురేశ్‌రెడ్డి, బి.పార్థసారథిరెడ్డి.. బీసీల నుంచి బడుగుల లింగయ్య యాదవ్ ప్రాతినిధ్యం వహించనున్నారు.
దీవకొండ దామోదర్‌రావు
పుట్టినతేదీ: 1958 ఏప్రిల్ 01
స్వస్థలం: జగిత్యాల జిల్లా ముద్దనూరు
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
– తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచారు.
– టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, కార్యదర్శిగా (ఆర్థిక వ్యవహారాలు) వివిధ హోదాల్లో పనిచేశారు.
– ప్రస్తుతం టీ–న్యూస్, నమస్తే తెలంగాణ సీఎండీగా పనిచేస్తున్నారు. టీటీడీ సభ్యుడిగా ఉన్నారు.
– గతంలోనే రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని భావించినా సామాజికవర్గ సమీకరణాల్లో కుదరలేదు. తాజాగా అవకాశమిచ్చారు.
వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)
పుట్టినతేదీ: 1964 మార్చి 22
స్వస్థలం: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి
ప్రస్తుత నివాసం: ఖమ్మం జిల్లా బుర్హాన్‌పురం
వృత్తి: గాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ
– తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ మున్నూరుకాపు ఆల్ అసోసియేషన్ జేఏసీ గౌరవ అధ్యక్షుడు
– 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు.
– తర్వాతి పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు లేదా ఖమ్మం జిల్లా నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు.
– మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన డి.శ్రీనివాస్ పదవీకాలం ముగుస్తుండటంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రకు కేసీఆర్ అవకాశమిచ్చారు.
– ఇది ఉప ఎన్నిక స్థానం కావడంతో రవిచంద్ర 2024 ఏప్రిల్ 2వ తేదీ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.
బండి పార్థసారథిరెడ్డి
పుట్టినతేది: 1954 మార్చి 6
స్వస్థలం: ఖమ్మం జిల్లా కందుకూరు
ప్రస్తుత నివాసం: హైదరాబాద్
వృత్తి: హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్
– దేశంలోనే టాప్ ఫార్మా సంస్థల్లో ఒకటైన హెటిరో అధినేతగా, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పార్ధసారథిరెడ్డికి మంచి పేరుంది.
– గ్రామీణ నేపథ్యం కలిగిన రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన మొదట డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్‌లో పరిశోధన శాస్త్రవేత్తగా చేరారు. అక్కడ పనిచేస్తూ పలు ఔషధాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.
– 1993లో హెటిరో డ్రగ్స్ కంపెనీని స్థాపించారు. గత మూడు దశాబ్దాల్లో ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా కృషి చేశారు.
– హెచ్‌ఐవీ, ఎయిడ్స్ సహా పలు వ్యాధులకు తక్కువ ధరలో ఔషధాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
– ఫార్మారంగంలో ఆయన చేసిన సేవలకు దేశ విదేశాల్లో అనేక అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment