‘సాగర్’ అభ్యర్థిగా మళ్లీ యాదవులకే చాన్స్‌! | TRS Focus On Strong Contest To Nagarjuna Sagar By Election | Sakshi
Sakshi News home page

‘సాగర్’ అభ్యర్థి కోసం గులాబీ దళాన్వేషణ

Published Sun, Mar 7 2021 3:26 AM | Last Updated on Sun, Mar 7 2021 12:22 PM

TRS Focus On Strong Contest To Nagarjuna Sagar By Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడుతుందని భావించినా.. నేటికీ స్పష్టత రావట్లేదు. ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా 3 నెలలుగా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌లో అభ్యర్థి ఎంపిక కసరత్తు ఇంకా కొనసాగుతోంది. తాజాగా కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుటుంబీకులకే టికెట్‌ ఇస్తారని, ఆయన కుమారుడు భగత్‌కు పోటీచేసే అవకాశం ఉందని మొదట్లో ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, స్థానిక నేత కోటిరెడ్డి పేర్లు సైతం పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో వినిపించింది.

ఈ ముగ్గురి అభ్యర్థిత్వానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, పార్టీ నేతల నుంచి కేసీఆర్‌ సేకరించి వివిధ కోణాల్లో విశ్లేషించినట్లు సమాచారం. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎదురయ్యే పోటీ, రెండు జాతీయ పార్టీల నుంచి పోటీ చేసే అవకాశమున్న ఆశావహులు, వారి బలాబలాలు... తదితర అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్న కేసీఆర్‌ అభ్యర్థి ఖరారు విషయంలో మాత్రం ఆచితూచి అడుగువేస్తున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.

ప్రచార ఇన్‌చార్జీలుగా ఎమ్మెల్యేలు
ఓ వైపు దీటైన అభ్యర్థి కోసం అన్వేషణ సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరోవైపు క్షేత్రస్థాయి ప్రచారంలో పార్టీ వెనుకబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదివరకే మండలాల వారీగా పార్టీ ఇన్‌చార్జిలను నియమించి కార్యకర్తలతో టీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు నిర్వహించింది. గత నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగర్‌ నియోజకవర్గం పరిధిలోని హాలియా బహిరంగ సభలో పాల్గొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మూడు నెలలుగా నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ పరిస్థితితో పాటు, కాంగ్రెస్, బీజేపీ కదలికలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తున్నారు. నేడో రేపో ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో తాజాగా పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఓ మున్సిపల్‌ మేయర్‌కు క్షేత్రస్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ వారిని ఇన్‌చార్జీలను నియమించారు.

ఇన్‌చార్జీలుగా నియమితులైన ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, భూపాల్‌రెడ్డి, కోరుకంటి చందర్, శంకర్‌ నాయక్, కోనేరు కోనప్ప, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు తదితరులు ఇప్పటికే నియోజకవర్గానికి చేరుకుని తమకు కేటాయించిన మండలాలు, మున్సిపాలిటీల్లో పార్టీ క్రియాశీల నేతలు, సర్పంచ్‌లు, ఇతర నేతలతో సమావేశమవుతున్నారు. ఎన్నికలు ముగిసేవరకు సాగర్‌ నియోజకవర్గంలోనే ఉండాలని ఇన్‌చార్జీలను కేసీఆర్‌ ఆదేశించారు. కాగా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముంది.

యాదవులకే చాన్స్‌!
నాగార్జునసాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నా అభ్యర్థి ఎంపికలో వివిధ సామాజికవర్గాలకు చెందిన ఓటర్ల గణాంకాలు కీలకంగా మారాయి. నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు కలిగిన యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దివంగత ఎమ్మెల్యే నోముల కూడా ఇదే సామాజికవర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. అయితే ఆయన కుమారుడు నోముల భగత్‌కు వేరే అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే యాదవ సామాజికవర్గానికి చెందిన ఇతరులకు టికెట్‌ కేటాయిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం యాదవ సామాజికవర్గానికి చెందిన స్థానికులు మన్నె రంజిత్‌ యాదవ్, పెద్దబోయిన శ్రీనివాస్, కట్టెబోయిన గురువయ్య యాదవ్‌తో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు ఈ ముగ్గురు నేతల పూర్వపరాలను తెలుసుకున్నారు. నోముల నర్సింహయ్య మరణం తర్వాత నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సమన్వయ బాధ్యతలు చూస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి అభిప్రాయం అభ్యర్థి ఎంపికలో కీలకమని పార్టీ నేతలు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement