సాక్షి, హైదరాబాద్: శాసనసభలో 9 రోజులపాటు జరిగిన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ముగిశాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చతోపాటు వార్షిక బడ్జెట్, పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లులు, ప్రశ్నోత్తరాలు తదితర సందర్భాల్లో తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించేందుకు అధికారపక్షం ప్రాధాన్యతనిచ్చింది. మరో వైపు ఇటీవలి కాలంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందనే అంశానికి గణాంకాలు జోడిస్తూ సభ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది.
కేంద్రం నుంచి రూ. 28 వేల కోట్ల బకాయిలు రాలేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, మిషన్ భగీరథకు ఆర్థిక సాయం వంటి విషయాలను మంత్రులు, అధికారపక్ష సభ్యులు ప్రసంగాల్లో ప్రస్తావించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి, గంగుల కేంద్రం తీరును దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పనిచేస్తుంటే బీజేపీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారని, బీజేపీకి స్వరాష్ట్ర భక్తి లేదని మంత్రి హరీశ్‌రావు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోందని, ఆత్మనిర్భర్ ప్యాకేజీలో రూ. 20 లక్షల కోట్లు ఎక్కడని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నిబంధనల మేరకు అప్పులు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రస్తావించారు.
నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన..
గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సంద ర్భంగా జరిగిన చర్చతోపాటు బడ్జెట్, పద్దులపై చర్చలో తమకు సమయం కేటాయించట్లేదని కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం అందుబాటులో ఉండటం లేదంటూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి రికార్డుల నుంచి తొలగించగా కాంగ్రెస్ వాకౌట్ చేసింది. తమకు సభలో తగిన సమయం ఇవ్వట్లేదంటూ భట్టి విక్రమార్క స్పీకర్‌కు లేఖ రాయడంతోపాటు ఆ పార్టీ సభ్యులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు వచ్చారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన దుబ్బాక బీజేపీ శాసనసభ్యుడు ఎం.రఘునందన్ రావు పలు అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక నియోజకవర్గ సమస్యలతోపాటు వివిధ అంశాలను ప్రస్తావించారు.
పీఆర్‌సీ సహా కీలక ప్రకటనలు
శాసనసభ సమావేశాల వేదికగా సీఎం కేసీఆర్, మంత్రులు పలు అంశాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. ఈ నెల 22న ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్, 61 ఏళ్ల ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై సీఎం ప్రకటన చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితుల్లో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వీటితోపాటు మాజీ ఎమ్మెల్యేలకు, జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శులకు వేతనాల పెంపు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల పెంపు హమీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ హామీ వంటి కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
కరోనా పరిస్థితుల్లో భౌతికదూరం పాటించడం, పాస్‌ల జారీలో ఆంక్షలు అమలు చేయగా వివిధ అంశాలకు సంబంధించి పలు సంఘాలు అసెంబ్లీ ముట్టిడికి ప్రయత్నించాయి. కరోనా పరిస్థితుల్లో శాసనమండలి కేవలం 5 రోజులు సమావేశమవగా సీఎం కేసీఆర్ పెద్దల సభకు హాజరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment