TRS MLAs Poaching Case: Another Sensation With Audio Leak - Sakshi
Sakshi News home page

పదిమంది చేరేలా పక్కా ప్లానింగ్‌!

Published Sat, Oct 29 2022 2:30 AM | Last Updated on Sat, Oct 29 2022 3:21 PM

TRS MLAs Poaching Case: Another Sensation with Audio Leak - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి శుక్రవారం లీకైన రెండు ఆడియోలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా పోలీసులు ఆరోపిస్తున్న నందు, రామచంద్ర భారతి, సింహయాజితో పాటు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిల సంభాషణలతో కూడిన ఈ ఆడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇవి ఈ నెల 26న అజీజ్‌నగర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి కొన్నిరోజులు ముందు జరిగిన ఫోన్‌ సంభాషణలుగా ఆడియోలు లీక్‌ చేసిన టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

కాగా ఆడియోల్లో ఢిల్లీకి చెందిన పెద్దలను నంబర్‌–1, నంబర్‌–2 అంటూ సం¿ోదించడం, నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం పది మంది బీజేపీలో చేరేలా ప్లానింగ్‌ చేస్తున్నామనడం, అమిత్‌ షాతో పాటు బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ పేరును ప్రస్తావించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు తెలియదని, అంతా కేంద్రస్థాయిలో జరుగుతోందని, మునుగోడు కంటే ముందే ఈ ఎపిసోడ్‌ పూర్తికావాలనే సంభాషణలు కూడా ఈ ఆడియో టేపుల్లో ఉన్నాయి.

మొదటి ఆడియో క్లిప్‌లో రామచంద్రభారతి, నందకుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నడుమ 7 నిమిషాలకు పైగా సంభాషణ జరగ్గా, రెండో ఆడియో క్లిప్‌ 27 నిమిషాల నిడివితో ఉంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిల మధ్య ఈ సంభాషణ జరిగింది. కాగా ఎమ్మెల్యేలకు ఎర అంశంలో బీజేపీ చేస్తున్న విమర్శల నేపథ్యంలో.. ఎర ప్రయత్నాలు నిజంగా జరిగాయనే విషయం నిర్ధారణ చేయడంలో భాగంగానే టీఆర్‌ఎస్‌ వర్గాలు ఈ ఆడియో క్లిప్‌లను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఆడియో సంభాషణల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 

ముగ్గురు, నలుగురు రాజీనామా చేస్తే ప్రభుత్వం రద్దు 
‘రోహిత్‌రెడ్డితో పాటు ఎంతమంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారో తెలిస్తేనే పెద్దల ముందు కూర్చునే అవకాశం ఉంటుంది. పేర్లు ఖరారైతే అమిత్‌షాతో పాటు అందరినీ లైనప్‌ చేయాల్సి ఉంటుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఎంతైనా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నెల రోజుల్లో కేసీఆర్‌ ప్రభుత్వం రద్దు చేస్తారు..’ అని రామచంద్ర భారతి అన్నారు. 

రోహిత్‌రెడ్డి రూ.100 కోట్లు అడుగుతున్నారు..  
‘బీజేపీలో చేరేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి వంద రూపాయలు (సంకేత భాషలో రూ.100 కోట్లు) అడుగుతున్నారు. ఆయనతో పాటు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండియా నంబర్‌ వన్‌తోనే డీల్‌ చేస్తున్నామని రోహిత్‌రెడ్డికి చెప్పాం. తొలి విడతలో నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు మరో ఐదారుగురు మాజీ ఎమ్మెల్యేలు కలుపుకొని మొత్తంగా పది మంది బీజేపీలో చేరేలా ప్లానింగ్‌ చేస్తున్నాం..’ అని నందకుమార్, సింహయాజిలు ఢిల్లీ బీజేపీ దూతగా చెబుతున్న రామచంద్ర భారతికి ఫోన్‌లో వివరించారు.  

ఎమ్మెల్యేలతో ముఖాముఖికి ఏర్పాట్లు చేయండి.. 
‘అమిత్‌ షాతో పాటు బీఎల్‌ సంతోష్ తో నేను రెండు గంటల పాటు మాట్లాడా. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు వస్తే ఎంతకైనా కొనుగోలు చేసేందుకు సిద్ధం. ఈ నెల 26న ఉదయం హైదరాబాద్‌కు వస్తా. రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీకి ఏర్పాట్లు చేయండి. అదే రోజు సాయంత్రానికి తుషార్‌ను కూడా హైదరాబాద్‌కు రమ్మని చెప్తా. డీల్‌ కుదిరితే 27న బీఎల్‌ సంతోష్‌తో కలిసి ఢిల్లీకి వెళదాం..’ అని రామచంద్ర భారతి సమాధానం ఇచ్చారు.   

మరో 15 మంది చేరతారు.. 
‘పైలట్‌ రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు..’ అని రామచంద్ర భారతికి నందకుమార్‌ చెప్పారు. ‘చేవెళ్ల, పరిగి, కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలను కలుస్తాం. ఇప్పటికే కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలతో చర్చించాం. ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పేందుకు ఎంతో కష్టపడుతున్నాం. ఇప్పటివరకు నలుగురు సిద్ధంగా ఉన్నారు. వెంట వెంటనే మరో 15 మంది కూడా చేరతారు. అయితే హైదరాబాద్‌కు వస్తేనే మిగతా ముగ్గురి పేర్లు వెల్లడించగలం..’ అని నందకుమార్, సింహయాజి చెప్పారు. 

సంజయ్, కిషన్‌రెడ్డి సమక్షంలో భేటీ ఉండదు 
‘నలుగురు, ఐదుగురు అంటే కేంద్రం ఆసక్తి చూపదు. లేదంటే ప్రాజెక్టును డ్రాప్‌ చేద్దాం. డీల్‌ కుదిరితే బీఎల్‌ సంతోష్‌ ద్వారానే ముందుకు వెళతాం. బండి సంజయ్, కిషన్‌రెడ్డి సమక్షంలో ఈ భేటీ ఉండదు. ఢిల్లీలోనూ 43 మంది ఎమ్మెల్యేలు లైన్‌లో ఉన్నారు..’ అంటూ రామచంద్ర భారతి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దాసోజు శ్రవణ్‌ ద్వారా కాంగ్రెస్‌ నుంచి కూడా చేరికలు జరిగేలా చూడాలని ఆయన సూచించగా, ఇప్పటికే దాసోజుతో పాటు స్వామిగౌడ్, భిక్షమయ్య బీజేపీలో చేరారని సమాధానం ఇచ్చారు. స్థానికంగా బీజేపీ నాయకత్వం సరిగా లేదని నందకుమార్‌ అన్నారు. నందకుమార్‌కు ఏదైనా పదవి ఇచ్చి రక్షణ కూడా ఇవ్వాలని సింహయాజి కోరగా, ఎంపీ రఘురామ రాజు తరహాలో వై ప్లస్‌ రక్షణ ఇచ్చేలా చూస్తానని రామచంద్రభారతి హామీ ఇచ్చారు. 

సీఎంకు తెలిస్తే పని పడతారు: రోహిత్‌రెడ్డి 
‘నాతో పాటు వచ్చేందుకు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకున్నారు. అయితే పేర్లు కన్‌ఫర్మ్‌ చేసుకునేందుకు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది. మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందున హైదరాబాద్‌లో కలుద్దాం. మా సీఎం చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి. ఆయనకు తెలిస్తే మా పని పడతారు. ఎక్కువమంది కోసం ప్రయత్నించకండి. నంబర్‌–2 ఎదుట చేరేందుకు సిద్ధంగా ఉన్న వారి పేర్లు చెబుతా. నా రక్షణ, భవిష్యత్తుపై నందూ నుంచి హామీ లభించింది..’ అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫోన్‌లో వ్యాఖ్యానించారు.  

26న భేటీకి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ 
‘బెడ్‌ రెస్ట్‌లో ఉన్నందున 24 వరకు హైదరాబాద్‌కు రాలేను. బల్క్‌ రెడీగా ఉంటే 24 తర్వాత హైదరాబాద్‌లో కలిసి మాట్లాడుకుని మీరు ఇచ్చే ప్రపోజల్‌ ప్రకారమే ముందుకు వెళదాం. మునుగోడు ఎన్నిక జరిగే లోపే చేరికలు జరగాలి. 25న గ్రహణం ఉన్నందున 26న కూర్చునేందుకు అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మీ భద్రత, మీ భవిష్యత్‌ అంతా కేంద్రం చూసుకుంటుంది. మా సంస్థలో బీఎల్‌ సంతోష్‌ చాలా కీలకం. నంబర్‌–1, 2లే సంతోష్‌ ఇంటికి వస్తుంటారు. వారి ఇళ్లకు సంతోష్‌ వెళ్లరు. అది ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రొటోకాల్‌. ఇలాంటి విషయాలను హ్యాండిల్‌ చేయడంలో బెంగాల్‌ ఎపిసోడ్‌ మాకు మంచి అనుభవం’ అని రామచంద్ర భారతి అన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement