voice record
-
పదిమంది చేరేలా పక్కా ప్లానింగ్!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి శుక్రవారం లీకైన రెండు ఆడియోలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా పోలీసులు ఆరోపిస్తున్న నందు, రామచంద్ర భారతి, సింహయాజితో పాటు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిల సంభాషణలతో కూడిన ఈ ఆడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇవి ఈ నెల 26న అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి కొన్నిరోజులు ముందు జరిగిన ఫోన్ సంభాషణలుగా ఆడియోలు లీక్ చేసిన టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆడియోల్లో ఢిల్లీకి చెందిన పెద్దలను నంబర్–1, నంబర్–2 అంటూ సం¿ోదించడం, నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం పది మంది బీజేపీలో చేరేలా ప్లానింగ్ చేస్తున్నామనడం, అమిత్ షాతో పాటు బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రస్తావించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు తెలియదని, అంతా కేంద్రస్థాయిలో జరుగుతోందని, మునుగోడు కంటే ముందే ఈ ఎపిసోడ్ పూర్తికావాలనే సంభాషణలు కూడా ఈ ఆడియో టేపుల్లో ఉన్నాయి. మొదటి ఆడియో క్లిప్‌లో రామచంద్రభారతి, నందకుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నడుమ 7 నిమిషాలకు పైగా సంభాషణ జరగ్గా, రెండో ఆడియో క్లిప్ 27 నిమిషాల నిడివితో ఉంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిల మధ్య ఈ సంభాషణ జరిగింది. కాగా ఎమ్మెల్యేలకు ఎర అంశంలో బీజేపీ చేస్తున్న విమర్శల నేపథ్యంలో.. ఎర ప్రయత్నాలు నిజంగా జరిగాయనే విషయం నిర్ధారణ చేయడంలో భాగంగానే టీఆర్ఎస్ వర్గాలు ఈ ఆడియో క్లిప్‌లను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఆడియో సంభాషణల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ముగ్గురు, నలుగురు రాజీనామా చేస్తే ప్రభుత్వం రద్దు ‘రోహిత్‌రెడ్డితో పాటు ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారో తెలిస్తేనే పెద్దల ముందు కూర్చునే అవకాశం ఉంటుంది. పేర్లు ఖరారైతే అమిత్‌షాతో పాటు అందరినీ లైనప్ చేయాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతైనా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నెల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేస్తారు..’ అని రామచంద్ర భారతి అన్నారు. రోహిత్‌రెడ్డి రూ.100 కోట్లు అడుగుతున్నారు.. ‘బీజేపీలో చేరేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి వంద రూపాయలు (సంకేత భాషలో రూ.100 కోట్లు) అడుగుతున్నారు. ఆయనతో పాటు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండియా నంబర్ వన్‌తోనే డీల్ చేస్తున్నామని రోహిత్‌రెడ్డికి చెప్పాం. తొలి విడతలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మరో ఐదారుగురు మాజీ ఎమ్మెల్యేలు కలుపుకొని మొత్తంగా పది మంది బీజేపీలో చేరేలా ప్లానింగ్ చేస్తున్నాం..’ అని నందకుమార్, సింహయాజిలు ఢిల్లీ బీజేపీ దూతగా చెబుతున్న రామచంద్ర భారతికి ఫోన్లో వివరించారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖికి ఏర్పాట్లు చేయండి.. ‘అమిత్ షాతో పాటు బీఎల్ సంతోష్ తో నేను రెండు గంటల పాటు మాట్లాడా. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తే ఎంతకైనా కొనుగోలు చేసేందుకు సిద్ధం. ఈ నెల 26న ఉదయం హైదరాబాద్‌కు వస్తా. రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీకి ఏర్పాట్లు చేయండి. అదే రోజు సాయంత్రానికి తుషార్‌ను కూడా హైదరాబాద్‌కు రమ్మని చెప్తా. డీల్ కుదిరితే 27న బీఎల్ సంతోష్‌తో కలిసి ఢిల్లీకి వెళదాం..’ అని రామచంద్ర భారతి సమాధానం ఇచ్చారు. మరో 15 మంది చేరతారు.. ‘పైలట్ రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు..’ అని రామచంద్ర భారతికి నందకుమార్ చెప్పారు. ‘చేవెళ్ల, పరిగి, కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలను కలుస్తాం. ఇప్పటికే కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలతో చర్చించాం. ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పేందుకు ఎంతో కష్టపడుతున్నాం. ఇప్పటివరకు నలుగురు సిద్ధంగా ఉన్నారు. వెంట వెంటనే మరో 15 మంది కూడా చేరతారు. అయితే హైదరాబాద్‌కు వస్తేనే మిగతా ముగ్గురి పేర్లు వెల్లడించగలం..’ అని నందకుమార్, సింహయాజి చెప్పారు. సంజయ్, కిషన్‌రెడ్డి సమక్షంలో భేటీ ఉండదు ‘నలుగురు, ఐదుగురు అంటే కేంద్రం ఆసక్తి చూపదు. లేదంటే ప్రాజెక్టును డ్రాప్ చేద్దాం. డీల్ కుదిరితే బీఎల్ సంతోష్ ద్వారానే ముందుకు వెళతాం. బండి సంజయ్, కిషన్‌రెడ్డి సమక్షంలో ఈ భేటీ ఉండదు. ఢిల్లీలోనూ 43 మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు..’ అంటూ రామచంద్ర భారతి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దాసోజు శ్రవణ్ ద్వారా కాంగ్రెస్ నుంచి కూడా చేరికలు జరిగేలా చూడాలని ఆయన సూచించగా, ఇప్పటికే దాసోజుతో పాటు స్వామిగౌడ్, భిక్షమయ్య బీజేపీలో చేరారని సమాధానం ఇచ్చారు. స్థానికంగా బీజేపీ నాయకత్వం సరిగా లేదని నందకుమార్ అన్నారు. నందకుమార్‌కు ఏదైనా పదవి ఇచ్చి రక్షణ కూడా ఇవ్వాలని సింహయాజి కోరగా, ఎంపీ రఘురామ రాజు తరహాలో వై ప్లస్ రక్షణ ఇచ్చేలా చూస్తానని రామచంద్రభారతి హామీ ఇచ్చారు. సీఎంకు తెలిస్తే పని పడతారు: రోహిత్‌రెడ్డి ‘నాతో పాటు వచ్చేందుకు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకున్నారు. అయితే పేర్లు కన్ఫర్మ్ చేసుకునేందుకు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది. మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందున హైదరాబాద్‌లో కలుద్దాం. మా సీఎం చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి. ఆయనకు తెలిస్తే మా పని పడతారు. ఎక్కువమంది కోసం ప్రయత్నించకండి. నంబర్–2 ఎదుట చేరేందుకు సిద్ధంగా ఉన్న వారి పేర్లు చెబుతా. నా రక్షణ, భవిష్యత్తుపై నందూ నుంచి హామీ లభించింది..’ అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫోన్లో వ్యాఖ్యానించారు. 26న భేటీకి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ‘బెడ్ రెస్ట్‌లో ఉన్నందున 24 వరకు హైదరాబాద్‌కు రాలేను. బల్క్ రెడీగా ఉంటే 24 తర్వాత హైదరాబాద్‌లో కలిసి మాట్లాడుకుని మీరు ఇచ్చే ప్రపోజల్ ప్రకారమే ముందుకు వెళదాం. మునుగోడు ఎన్నిక జరిగే లోపే చేరికలు జరగాలి. 25న గ్రహణం ఉన్నందున 26న కూర్చునేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ భద్రత, మీ భవిష్యత్ అంతా కేంద్రం చూసుకుంటుంది. మా సంస్థలో బీఎల్ సంతోష్ చాలా కీలకం. నంబర్–1, 2లే సంతోష్ ఇంటికి వస్తుంటారు. వారి ఇళ్లకు సంతోష్ వెళ్లరు. అది ఆర్ఎస్ఎస్ ప్రొటోకాల్. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో బెంగాల్ ఎపిసోడ్ మాకు మంచి అనుభవం’ అని రామచంద్ర భారతి అన్నారు. -
కొబ్బరి నీళ్లు తీసుకురా..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతో ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపిన కేసు కావటంతో పక్కా సాక్ష్యాధారాలతో నిందితులను పట్టుకునేందుకు ప్రణాళిక రూపొందించాకే సైబరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఢిల్లీలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందకుమార్, తిరుపతికి చెందిన సింహయాజి స్వామిలను పకడ్బందీ స్కెచ్‌తో ట్రాప్‌లో పడేశారు. ముందస్తు ప్రణాళికతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి జేబుల్లో వాయిస్ రికార్డర్లు, హాల్లో కెమెరాలు అమర్చారు. రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా..’ అంటూ సంకేతాన్ని ఇచ్చిన తర్వాత దాడి చేసేలా వ్యూహం రూపొందించారు. ఈనెల 26న రాత్రి మెయినాబాద్ అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో చర్చలు జరిపేందుకు ముగ్గురు బీజేపీ రాయబారులు వస్తున్న సంగతి ముందుగానే తెలియడంతో ఈ మేరకు స్కెచ్చేశారు. శుక్రవారం హైకోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు ఈ అంశాలన్నీ పొందుపరిచారు. రోహిత్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్ కావటంతో ఆయన్నే లీడ్‌గా తీసుకొని ఈ స్కెచ్ వేసినట్లు, మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లినట్లు తెలిపారు. రిమాండ్ రిపోర్ట్‌లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్పష్టంగా రికార్డయ్యేలా.. ఎమ్మెల్యేలతో ముగ్గురు నిందితుల ఆడియో, వీడియో సంభాషణలు స్పష్టంగా రికార్డయ్యేలా అత్యాధునిక కెమెరాలను వినియోగించారు. రోహిత్‌రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు, వారు కూర్చొని ఉన్న హాల్లో నాలుగు అత్యాధునిక రహస్య కెమెరాలు భేటీ కంటే ముందే బిగించారు. ఫామ్‌హౌస్ హాల్లోని రహస్య కెమెరాలను మధ్యాహ్నం 3.05 గంటలకు ఆన్ చేశారు. మరో 5 నిమిషాల తర్వాత 3.10 గంటలకు ముగ్గురు నిందితులతో కలిసి రోహిత్ రెడ్డి హాల్లోకి వచ్చారు. సాయంత్రం 4.10 గంటలకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగ కాంతరావులు వచ్చినట్లు రికార్డయింది. సుమారు మూడున్నర గంటల పాటు నిందితులతో ఎమ్మెల్యేలు చర్చించారు. సిగ్నల్ ఇవ్వగానే.. ఎమ్మెల్యేలతో నిందితులు సంభాషిస్తున్నప్పుడు ఏ సమయంలో పోలీసులు దాడి చేయాలన్నది ముందుగానే స్కెచ్ వేశారు. చర్చలు పూర్తయ్యాక ఏదైనా ఒక సిగ్నల్ వస్తే లోపలికి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవా లని పోలీసులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితులతో భేటీ పూర్తికాగానే రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా’ అని సిగ్నల్ ఇచ్చేలా ఆయన్ని ముందుగానే ప్రిపేర్ చేశారు. ఆ మేరకు రోహిత్‌రెడ్డి ‘కొబ్బరి నీళ్లు తీసుకురా’ అని అనగానే సైబరాబాద్ పోలీసులు ఒక్కసారిగా లోనికి ప్రవేశించారు. తలుపులు తెరిచి నలుగురు ఎమ్మెల్యేలతో ఉన్న ముగ్గురు నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 ఇస్తామన్న సంభాషణ వాయిస్ రికార్డర్లలో నమోదైంది. అలాగే కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ ఈ తరహా ఆపరేషన్ చేశామన్న రామచంద్రభారతి సంభాషణ, తుషార్‌కు రామచంద్రభారతి ఫోన్ చేయడం కూడా రికార్డయ్యాయి. తెలంగాణకు సంబంధించి ముఖ్య విషయం మాట్లాడాలని సునీల్ కుమార్ బన్సల్‌కు రామచంద్రభారతి సెల్‌ఫోన్ సందేశం పంపినట్లు కూడా రికార్డయింది. కాగా ఈ మెసేజ్‌తో పాటు రామచంద్ర భారతి, నందకుమార్ వాట్సప్ చాటింగ్‌లను స్క్రీన్ షాట్లు తీసి సాక్ష్యాధారాల కోసం పొందుపరిచినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. నందు డైరీలో 50 మంది జాబితా.. నందకుమార్ డైరీలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేల వివరాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందులో 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ.. ‘సంతోష్ బీజేపీ‘ పేరుతో ఉన్న ఫోన్ నంబర్‌కు రామచంద్రభారతి వాట్సప్ మెసేజ్ పంపించారని తెలిపా. ఇలావుండగా నిందితుల నుంచి పోలీసులు సెల్ఫోన్లు, డైరీ స్వాధీనం చేసుకున్నారు. -
సైబర్ క్రైమ్: ఫోన్లో గూఢచర్యం..
ఊరు నుంచి వచ్చాక అల్మారా తెరిచి చూసిన సుమిత్ర(పేరుమార్చడమైనది) షాక్ అయ్యింది. తను భద్రంగా ఉంచిన బంగారం కనిపించలేదు. అల్మరా తాళాలు ఎక్కడ పెట్టిందో తనకు మాత్రమే తెలుసు. అవి ఎక్కడ ఉంచిందో అక్కడే జాగ్రత్తగా ఉన్నాయి కూడా. ఇంట్లో కొడుకు కోడలిని అడిగితే తమకేమీ తెలియదని, పెద్ద కోడలికి ఇచ్చారేమో అంటూ నిష్టూరంగా మాట్లాడారు. సుమిత్రకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. భర్త సంపాదించినది, తన దగ్గర ఉన్న బంగారం ఇంకా పిల్లలకు పంచలేదు. ఇద్దరు కొడుకులు ఉద్యోగ రీత్యా మంచి స్థాయిలో ఉండటంతో వారు సొంతిళ్లు కట్టుకుని ఉంటున్నారు. చిన్నకొడుకు ఆర్థికంగా స్థిరపడకపోవడంతో తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సుమిత్ర, ఆమె భర్త రఘునాథం సర్దుకుపోయేవారు. కానీ, ఈ మధ్య ఆస్తి వ్యవహారంలో కొడుకుల మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి. కోడలు ప్రవర్తన మరింత విచిత్రంగా ఉంది. బంగారం పోవడంతో పోలీసులను సంప్రదించారు సుమిత్ర, ఆమె భర్త. ఫోన్ సంభాషణతో చౌర్యం ఇంటి పరిస్థితి కనుక్కుంటే కొన్ని నెలలుగా తమ కొడుకు, కోడలు తమపై గూఢచర్యం చేస్తున్నారని, తమ పిల్లలతోనూ, బంధువులతోనూ తాము ఫోన్లో మాట్లాడుకున్న విషయాలు కూడా వారికి తెలిసిపోతున్నాయని, ఇంట్లో ప్రశాంతత కోల్పోయామని చెప్పుకున్నారు సుమిత్ర దంపతులు. వారి దగ్గర ఉన్న ఫోన్ చెక్ చేసి చూస్తే అందులో చిన్న కోడలు స్పై యాప్‌ని ఇన్స్టాల్ చేసి, రికార్డర్ వాయిస్‌ను తన ఈ మెయిల్‌కు లింక్ చేసినట్టుగా గుర్తించారు. దీని ద్వారా కుటుంబంలో మిగతావారితో జరిగే ఫోన్ సంభాషణ అంతా కొడుకు, కోడలు వినేవారని తెలిసింది. అందులో భాగంగా సుమిత్ర తన కూతురి తో ఫోన్లో మాట్లాడినప్పుడు అల్మరాలో ఉంచిన బంగారం, రహస్యంగా ఉంచిన తాళాల గురించి చెప్పింది. అది తెలుసుకున్న కొడుకు కోడలు ఆ బంగారాన్ని దొంగతనం చేసి, తమకేమీ తెలియదని, మిగతా కొడుకులకు, కూతురుకు ఇచ్చి ఉంటారని దురుసుగా మాట్లాడారు. ఇదో మానసిక జాడ్యం కుటుంబ సంబంధాలలో అనుమానాలు ఉంటేనే ఇలాంటివి జరుగుతుంటాయి అనుకుంటే పొరబాటే. బయటి వారు కూడా ఇతరులను ఇరకాటంలో పెట్టడానికి ఇలాంటి చర్యలకు పూనుకోవచ్చు. వారిలో అత్యంత సన్నిహితులు అనదగిన వారు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఎన్ఆర్ఐ మ్యారేజీ విషయాల్లో కాబోయే భాగస్వామి పట్ల అనుమానంతో ఇలాంటి గూఢచర్యం చేస్తుంటారు. భార్యాభర్తల సంబంధం విషయంలోనూ అనుమానం వల్లే ఇలాంటి స్పైవేర్లు పుట్టుకు వస్తాయి. ఫోన్ సర్వీస్ పాయింట్లలోనూ ఇలాంటి స్పై కెమరా యాప్‌లు ఇన్స్టాల్ చేసి, వాటి ద్వారా అమ్మాయిల వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. యాంటీ స్పై వేర్... ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు మన ఫోన్ ఇవ్వకుండా ఉండటం మొదటగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. ► మాల్వేర్ లేదా స్పై వేర్ యాప్ ఇన్స్టాల్ చేసినట్టుగా కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. ► ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా ఖాళీ అవుతుంటుంది. ► పాప్ అప్ యాడ్స్ నిరంతరం వస్తూ ఉంటాయి. ► డేటా వినియోగం పెరిగినట్టుగా చూపుతుంది. ► ఇతర పాప్ అప్ యాప్ నోటిఫికేషన్స్ విరివిగా వస్తుంటాయి. ► మాల్వేర్ లేదా స్పై వేర్ ఉందని అనుమానించినట్లయితే యాంటీ వైరస్, యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయాలి. ఫోన్‌ని స్కాన్ చేయాలి. అవసరం లేని యాప్స్‌ను తొలగించాలి. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
విందాం.. చిట్టిగుండె చప్పుడు!
మాతృత్వంలోనే ఉంది మహిళ జన్మసార్థకం. అమ్మ అనిపించుకొనుటే స్త్రీమూర్తికి గౌరవం. బిడ్డ కడుపులో³డగానే తల్లి ఎనలేని సంతోషాన్నిపొందుతుంది. మరి గర్భస్థ శిశువు భూమిమీద పడకముందే హృదయస్పందనలు తెలుసుకుంటే అంతకుమించిన ఆనందం ఆ తల్లికి మరేముంటుంది. అదిగో ఆ దిశగా కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. గర్భంలో ఉన్న బేబీ హార్ట్ బీట్‌ను స్పష్టంగా వినేందుకు ‘సునో’ పేరుతో ఓ డివైజ్‌ను కనుగొన్నారు నగరానికి చెందిన ఇద్దరు యువకులు. ప్రస్తుతం ఈ డివైజ్ గర్భిణులు తమ బేబీ హృదయ స్పందనలు వినేందుకు ఉపయుక్తంగా మారింది.. హిమాయత్‌నగర్: నగరంలోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన పవన్‌కుమార్ బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ (ఎలక్ట్రానిక్స్) పూర్తి చేశారు. ఎండీ సాధ్ గుంటూరులోని ఎన్ఆర్ఐ కళాశాల్లో ఇంజినీరింగ్ చేశారు. ‘డుకేరా టెక్నాలజీస్’లో ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ సమయంలో కంటిచూపు లేని వారి కోసం ప్రత్యేకంగా షూస్‌ను రూపొందించారు. ఇవి అంధులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. అదే ఉత్సాహంతో మరేదైనా కొత్త ఆవిష్కరణ చేయాలనే తపనతో పరిశోధన చేయసాగారు. ఈ నేపథ్యంలోనే గర్భిణులకు ఉపయుక్తంగా ఉండే ఉపకరణం ఏదైనా కనుగొనాలనే ఆలోచన వచ్చింది. దీంతో బేబీ హార్ట్ బీట్ వినేందుకు ఓ డివైజ్‌ను రూపొందించారు. వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి బేబీపై దంపతులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. భార్యభర్తల మధ్య జరిగే సంభాషణ కూడా బేబీ గురించే ఉంటుంది. ఈ డివైజ్ ద్వారా హార్ట్‌బీట్‌ను స్నేహితులు, బంధువులతోనూ షేర్ చేసుకోవచ్చు. హార్ట్‌బీట్ వింటున్న సమయంలో యాప్‌లో షేర్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ని ఎంచుకుని నచ్చిన వారికి ఒక్క క్లిక్‌తో బేబీ హార్ట్‌బీట్‌ను షేర్ చేసుకోవచ్చు. నార్మల్డెలివరీ కోసం ప్రత్యేక తరగతులు.. ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ లెక్కల ప్రకారం ఇతర దేశాల్లో శస్త్రచికిత్సలు 10 నుంచి15 శాతం నమోదవుతున్నాయి. మన దేశంలో 23 నుంచి 75 శాతం నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో సిజేరియన్లు 75 శాతం నమోదవుతున్నట్లు ‘వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్’ స్పష్టం చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పవన్, ఎండీ సాధ్‌లు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఈ నెల చివర్లో చైల్డ్ బెర్త్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్‌తో ప్రెగ్నెన్సీ ఉమెన్స్‌కి ఆన్లైన్లో క్లాసెస్‌ను చెప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి బేబీ డెలివరీ అయ్యే వరకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే అన్ని విషయాలను ఆన్లైన్ ద్వారా క్లాసెస్ చెబుతారు. ప్రస్తుతానికి దీనిని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ప్రారంభించనున్నారు. త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా దీనిలో రిజిస్టరైన వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే వారికి కన్వినెంట్‌గా ఉన్న సమయంలో క్లాసెస్ వినొచ్చు. దీని ద్వారా సిజేరియన్లు తగ్గి నార్మల్ డెలివరీకి మార్గం సులభమవుతుందని చెబుతున్నారు పవన్, సాద్. ఇలావినవచ్చు.. రిసీవర్, ఎక్స్టెన్షన్ బాక్స్, రెండు కేబుళ్లతో ఎలక్రానిక్ డివైజ్‌ను రూపొందించారు. దీనికి ‘సునో’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ డివైజ్ ఆన్లైన్లో రూ.2500, మార్కెట్లో రూ.3 వేలకు లభిస్తోంది. గర్భిణుల కోసం దీనిని కొనుగోలు చేయవచ్చు. ముందుగా మొబైల్లో ‘సునో’ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాలి. అనంతరం రీసీవర్కు రెండు కేబుల్స్‌ని కనెక్ట్ చేయాలి. ఈ రెండు కేబుళ్లల్లో ఒకటి మొబైల్‌కు పెట్టే ఆడియో కేబుల్, మరొకటి రిసీవర్‌కు పెట్టేది. ఈ రెండు కనెక్ట్ చేశాక యాప్‌లోని ఆప్షన్స్‌ని ఎంచుకుని డివైజ్‌ను గర్భిణి తన పొత్తికడుపుపై పెట్టుకొని బేబీ బీట్‌ను స్పష్టంగా వినవచ్చు. గర్భస్థ శిశువుకు 7 నెలలు నిండిన తర్వాత నుంచి ఈ హార్ట్‌బీట్ వినవచ్చని పవన్, సాద్‌లు చెబుతున్నారు. -
అమ్మా క్షమించు..
బి.కొత్తకోట/చిత్తూరు ఎడ్యుకేషన్: ‘అమ్మా నన్ను క్ష మించు.. నేను బతికుండి రోజూ చావలేను.. అందుకే ధైర్యం చాలక మద్యం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని తల్లికి సూసైడ్ నోట్ రాసి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న డి.శ్రీకాంత్‌రెడ్డి (27) బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని పెద్దపసుపుల గ్రామానికి చెందిన డి.వెంకటరెడ్డి ఉపాధ్యాయుడు. ఆయన బి.కొత్తకోట మండలం శీలం వారిపల్లె పంచాయతీ గుంతావారిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. 2015 వరకు ఇక్కడి పనిచేసిన ఆయన పీటీఎం మండలానికి బదిలీ అయ్యా రు. పల్లె వాతావరణంలోనే నివాసముండాలని గుంతావా రిపల్లె సమీపంలో 25 కుంటల భూమిని కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. ఏడాదిన్నర క్రితం ఆయన ప్రమాదంలో మృతి చెందారు. దీంతో ఇంటర్ వరకు చది విన కుమారుడు డి.శ్రీకాంత్‌రెడ్డికి చిత్తూరు డీఈవో కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం వచ్చింది. అతను 6 నెలలుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి మూడు రోజులు సెలవు తీసుకుని సొంతూ రు వచ్చాడు. ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఇతనికి అక్క సంధ్య, తల్లి రమాదేవి ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఇన్చార్జ్ ఎస్ఐ కేవీహెచ్.నాయుడు, ఏఎస్ఐ టీ.ప్రసాద్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. రమాదేవి ఆరోగ్యం బాగలేకపోవడంతో వైద్యం కోసం బెంగళూరు వెళ్లారు. వారికి సమాచారం అందించారు. అమ్మా నిన్ను బాధపెడుతున్నా.. అత్మహత్యకు ముందు శ్రీకాంత్‌రెడ్డి సూసైడ్ నోట్ రా శాడు. అందులో ‘సారీ మా.. నా తలలో ఏదో దూరింది.. నేను బతికుండి రోజూ చావలేను.. నా మెంటల్ కండీషన్ బాగోలేదు.. నన్ను క్షమించు మా నిన్ను బాధపెడుతున్నందుకు. నేను జాబ్‌లో చేరినప్పటి నుంచి హ్యాపీగా లేను. కొద్దిరోజులైతే అలవాటుపడతాననుకొన్నా. కానీ నావల్ల కావడం లేదు. నాన్న ఉన్నప్పుడు నేను ఇలా లేను. నా మనసు ఈ జీవితానికి అలవాటు పడట్లేదు. మా నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు బాధపడకు. నా ఆత్మకు శాంతి ఉండదు. మా నువ్వు, నా ఫ్రెండ్స్ బాగుండాలి. డోంట్ క్రై మా.. సారీ మా.. మిస్ యూ మా. లేఖలో తప్పులున్నా యి ఎందుకంటే తాగి ఉన్నాను క్షమించు మా.. సారీ ఫ్రెండ్స్ తాగడానికి కారణం చావడానికి ధైర్యం చాలలా.. సంధ్య అమ్మను బాగా చూసుకో. నా చావుతో ఎవరికి ఎటువంటి సంబంధం లేదు’ అంటూ సంతకం చేసి ముగించాడు శ్రీకాంత్‌రెడ్డి. స్నేహితులకు వాయిస్ రికార్డ్ ఆత్మహత్యకు ముందు శ్రీకాంత్‌రెడ్డి స్నేహితులకు వాయిస్ రికార్డ్ పంపించాడు. అందులో మా సారీ మా.. బాయ్ మా.. నేను వెళ్లిపోతున్నా.. అని ఉంది. వాయిస్ రికార్డును చూసిన మిత్రులు అనుమానంతో శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్ చేసినా స్పందించలేదు. మదనపల్లె నుంచి ఇద్దరు మిత్రులు గురువారం ఉదయమే గుంతావారిపల్లెకు చేరుకున్నారు. కిటికీలోంచి చూడగా శ్రీకాంత్‌రెడ్డి ఉరివేసుకొని మృతి చెంది ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాంత్‌రెడ్డి తమతో కలిసి మదనపల్లెలో చదువుకున్నాడని మిత్రులు వినోద్, సుధాకర్, ప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు శ్రీకాంత్‌రెడ్డి మంచివాడు. ఆరు నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నాడు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా.. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని సోమవారం నుంచి బుధవారం వరకు సెలవు తీసుకున్నాడు. ఇక్కడ అతనికి వేధింపులు, ఇబ్బందులు ఉన్నట్టు నా దృష్టికి రాలేదు. – పాండురంగయ్య, డీఈవో, చిత్తూరు -
ముప్పై పట్టుకుని రా.. పని అయిపోతది
సిరిసిల్లలో కౌన్సిలర్ భర్త కాసుల బేరం నిర్మాణ అనుమతులకు రూ.30వేలు డిమాండ్ అధికార పార్టీ నాయకుడి వసూళ్ల పర్వం కమిషనర్ అడుగుతున్నారని డిమాండ్ సోషల్ మీడియాలో వాయిస్ హల్చల్ సిరిసిల్ల: రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తామని, మున్సిపల్ పరిధిలో ఏ అనుమతి కావాలన్నా మీసేవ ద్వారా ఆన్లైన్లోనే అనుమతులు ఇప్పిస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. కానీ ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే అందుకు భిన్నంగా అధికారపార్టీకి చెందిన ఓ మహిళా కౌన్సిలర్ భర్త ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యాపారితో బేరాలు ఆడిన వైనం శుక్రవారం వెలుగుచూసింది. రూ.30 వేలు తీసుకుని రా.. అంటూ సదరు కౌన్సిలర్ భర్త కోరడం విశేషం. మున్సిపల్ కమిషనర్‌కు, టీపీఓకు ఇవ్వాలంటూ డబ్బులు అడుగుతున్న వాయిస్ మెసేజ్ శుక్రవారం సోషల్‌మీడియాలో హల్చల్ చేసింది. మూడు నిముషాల నిడివి గల ఆ వాయిస్ రికార్డులో కౌన్సిలర్ భర్త కాసులబేరమాడిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. వారి సంభాషణ ఇలా సాగింది. వ్యాపారి : ఓం నమఃశివాయా.. స్వామి.. కౌన్సిలర్ భర్త : ఆ.. ఓం శివాయా.. కౌన్సిలర్ భర్త: గా బిల్లు కట్టద్దా.. ఇయ్యాలా.. వ్యాపారి: బిల్లు కట్టాలే.. జెర అది కావాలే.. ఆ పని కావాలే ప్లీజ్. కౌన్సిలర్ భర్త: పర్మిషన్‌కు పైసలు కట్టద్దా. వ్యాపారి: కడుత.. కడుత.. ఎంతండు.. స్వామి. కౌన్సిలర్ భర్త: ఇప్పుడు అన్నీ కలిపి.. అవి.. ఇవీ.. ఆ.. ఒక్క నిముషం లైన్లో ఉండు.. (కొద్దిసేపటి తర్వాత) కమిషనర్ గారు.. మన ఏపీవో, టీపీవో ముగ్గురు కలిసి అడుగుతుండ్రు.. వాళ్ల ముగ్గురికి ఎంతిద్దాం. వ్యాపారి: ఇగ నువ్వే స్వామి.. మేం చిన్నోళ్లం కదా.. గరీబోళ్లం కదా.. కౌన్సిలర్ భర్త: అదే ఎంతిద్దాం.. అంటున్న.. వ్యాపారి: గరీబోళ్లం కదా స్వామి.. చెప్పు.. గవర్నమెంట్ చాలన్ ఎంతుంటది స్వామి.. కౌన్సిలర్ భర్త : ఇప్పుడు వీళ్లకు ఎంతిస్తవో చెప్పు.. దాని మీదికేయి మారుస్తా అంటుండ్రు.. వ్యాపారి: అట్ల కాదు.. గవర్నమెంట్ చాలన్ పోంగ ఏమిమ్మంటరో మీరే చెప్పుండ్రి స్వామి.. కౌన్సిలర్ భర్త: వాళ్లు ముప్పై అడుగుతుండ్రు. వ్యాపారి: నవ్వుతూ.. అంతా ఏ టూ జెడా..? కౌన్సిలర్ భర్త: ఆల్రడీ కాసనగొట్టు రాజు దగ్గర నలభైవేలు తీసుకున్నరట.. వ్యాపారి: ఏదో స్వామి... ఏదో చెయ్ నువ్వే.. కౌన్సిలర్ భర్త: వాళ్లు ముప్పై అడుగుతుండ్రు.. వాళ్ల దగ్గర నలబై తీసుకున్నరు.. వాళ్ల తమ్ముడేనాయే... ఈయనకు తక్కువ తీసుకుంటే మంచిగుండది.. ఈనె వాళ్లకు చెప్తె లేని ఇబ్బంది అయితది అంటుండ్రు.. వ్యాపారి: కరక్టే స్వామి.. వాళ్లది మాత్రం ఎంతుందో తెలుసా.. దాదాపు ఫేసింగ్ 47.. లోతు 55 వాళ్లది.. నాది ఎంత స్వామి. కౌన్సిలర్ భర్త: అందుకే పది తక్కువ చెప్పిండ్రు కదా.. వ్యాపారి: ఏ.. స్వామి.. ఓ పదిహేను ఇస్తా.. కౌన్సిలర్ భర్త: ఏ.. కూరగాయల బేరమా.. ఏమన్నా.. నీకర్థం కాదు.. వ్యాపారి: స్వామి.. స్వామి.. జెర సూడు..స్వామి.. మేం చిన్నోళ్లం కదా.. సరే గానీ ఓ ఇరవై వేలు ఇద్దామని చెప్పు.. కౌన్సిలర్ భర్త: బిల్లు తక్కువ చేపిస్తా.. సెట్ చేపిస్తా.. ముప్పై వేలు పట్టుకుని రా.. వ్యాపారి: అబ్బ.. మంచోడు కాదు.. దయా.. కౌన్సిలర్ భర్త: ముప్పై కానీ.. పైసలు పట్టుకుని రా.. వ్యాపారి: అబ్బ అబ్బ నేను ఇప్పుడు వేరే జాగల ఉన్న స్వామి..చేస్తా..చేస్తా.. కౌన్సిలర్ భర్త: ఏడున్నవ్.. వ్యాపారి: చేస్తా.. చేస్తా.. వేరే ఊరిలో ఉన్న స్వామి.. వస్తా.. కౌన్సిలర్ భర్త: మంచి మూడ్‌లో ఉన్నడయా.. కిరికిరి ఒడగొట్టుకో.. వ్యాపారి: నీకు కంపల్సరీ చేస్తాను.. ఓకే.. కౌన్సిలర్ భర్త: ఏడున్నవ్ ఇప్పుడు.. అరగంట వరకు తొందరగా రా.. నీ పని అయిపోతది.. రా.. అంటూ.. ఫోన్ సంభాషణ ముగుస్తుంది.. మున్సిపల్ కౌన్సిల్‌లోని కీలక వ్యక్తుల పేర్లు ఉటంకిస్తూ.. సదరు కౌన్సిలర్ భర్త వ్యాపారితో మాట్లాడిన సంభాషణలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త మాట్లాడిన మాటలు కీలక నాయకుల పేర్లు సైతం ఆయన మాటల్లో రావడం విశేషం. ఆ మాటలతో మాకు సంబంధం లేదు సంభాషణను నేను విన్నాను. ఆయన మాటలతో మాకు సంబంధం లేదు. మా పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు స్పష్టమవుతుంది. ఎవరైనా మా పేర్లు చెప్పి డబ్బులు అడిగితే.. వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. నిబంధనల ప్రకారం మేం నడుచుకుంటున్నాం. - బి.సుమన్‌రావు, కమిషనర్ ఇంకా చాలా రికార్డులున్నాయి.. కౌన్సిలర్ భర్తవే కాదు.. నా దగ్గర ఇంకా చాలా రికార్డులు ఉన్నాయి. మున్సిపల్ వాళ్లు నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. అందుకే రికార్డు చేశాను. - కాసనగొట్టు రమణయ్య, వ్యాపారి