సారు పిలిసిండు... అందరినీ రమ్మన్నడు. రొటీన్ మీటింగేనా? బీజేపీపై వైఖరి చెబుతడా? భారీ ప్లీనరీ పెడదమంటాడా? రాబోయే ఎన్నికల్లో ఎట్ల కొట్లాడుదమో చెప్తాడా? హు... హుహూ! ఇప్పుడివేవి జనం మదిలో లేవు. టీఆర్‌ఎస్ శ్రేణుల్లో అంతకన్నా లేవు. సమయం వచ్చేసిందా? కబ్ బనేగా? స్పష్టత ఇచ్చేస్తారా? అందరిలోనూ ఇదే టెన్షన్. ఎవరు? ఏమవుతారనే... ముచ్చట అందరికీ ఎరుకే. సంకేతాలిచ్చి సరిపెడతారా? సరాసరి ప్రకటనే వచ్చేస్తుందా? అధికారిక ‘ముద్ర’పడుతుందా? సంచలనాలేమీ లేకుండా ఆనవాయితీగా అధినేత దిశానిర్దేశంతో ముగుస్తుందా? చూద్దాం... ఆదివారం దాకా!!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండటంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్య క్షులు హాజరవుతారు.
పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల నియామకం, ఏప్రిల్ 27న పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారని పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీ, సంస్థాగత అంశాలపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నా... ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చదవండి: (నేడు రాష్ట్రానికి మాణిక్కం ఠాగూర్)
సీఎం పీఠంపై కేటీఆర్.. అంతటా అదే చర్చ
ఈ నెల 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదినం కాగా, మరుసటి రోజు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా పదవి చేపడతారని కొంతకాలంగా విస్తృత ప్రచారం సాగుతోంది. ఇదే అంశంపై మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతకాలంగా ప్రకటనలు చేస్తుండగా, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఏకంగా కేటీఆర్ సమక్షంలోనే ముఖ్యమంత్రి మార్పిడికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి పదవిని కేటీఆర్ చేపట్టడం ఖాయమని, ఫిబ్రవరి లేదా మే నెలలో సీఎం మార్పు ఖాయమని పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టతనిచ్చే అవకాశముందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సీఎం మార్పునకు సంబంధించిన ప్రచారం ఎక్కువ కాలం కొనసాగితే పార్టీకి నష్టం కూడా జరిగే అవకాశమున్నందున ఈ అంశంపై వీలైనంత త్వరగా స్పష్టతనివ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పునకు సంబంధించి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే మాత్రం రాష్ట్ర కార్యవర్గ సమావేశం వేదికగా సంకేతాలు ఇస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే అటు పార్టీలో, బయటా శరవేగంగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.
వివాదాస్పద నేతలకు హెచ్చరికలు
ఇటీవలి కాలంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతలు వివిధ సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు, చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా వేదికగా పార్టీ కొంత మేర ఇరకాట పరిస్థితి ఎదుర్కొంటోంది. మరోవైపు ఖమ్మం జిల్లాతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలు తరచూ విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన నేతల నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో పార్టీలో అంతర్గత క్రమశిక్షణ కట్టు తప్పుతోందనే భావన నెలకొంది. చదవండి: (ఆ రాబడులే రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు కీలకం)
ఆదివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఇలాంటి అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ స్పందిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో బీజేపీతో నెలకొన్న ఘర్షణ పూరిత వాతావరణం, అక్కడక్కడా దాడులకు కూడా దారితీస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ పార్టీ పట్ల టీఆర్‌ఎస్ వైఖరిపై కూడా కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశముంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత జరిగిన సీఎం ఢిల్లీ పర్యటన, వ్యవసాయ చట్టాలు, బడ్జెట్ తదితర అంశాలపై టీఆర్‌ఎస్ ప్రదర్శిస్తున్న వైఖరిపైనా ఈ సమావేశంలో ప్రస్తావనకు వస్తుందని భావిస్తున్నారు.
స్తబ్దుగా పార్టీ కార్యకలాపాలు
ఇటీవలి కాలంలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మినహా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఏకపక్ష విజయాలు సాధిస్తూ వచ్చింది. అయితే ఎన్నికలు వస్తే తప్ప మిగతా సందర్భాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాలపై అంతగా దృష్టి సారించడం లేదనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో ఉంది. జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు లేకపోవడం, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కార్యక్రమాలు జరుగుతుండటంతో పార్టీ కార్యకలాపాలు స్తబ్దుగా మారాయి. లోక్‌సభ ఎన్నికలు, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండేళ్లుగా పార్టీ ప్లీనరీ జరగకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్ 27న భారీగా ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
సుమారు రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ప్రారంభం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణంతో పాటు పార్టీ సభ్యత్వ పునరుద్దరణ వంటి అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతో పాటు త్వరలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక, నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment