సాక్షి, వరంగల్: ‘కొడకండ్లలో రైతువేదికను ప్రారంభిస్తే రాజ్యం తెచ్చినంత సంతోషంగా ఉంది. తెలం గాణలో రైతురాజ్యం సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. చైతన్యదీపికలుగా రైతు వేదికలు పనిచేస్తాయని, ఇవి రైతు విప్లవానికి నాంది అవు తాయని చెప్పారు. దేశంలో ఎక్కడా రైతులకు సంఘాలు, వేదికలు లేవని, కేవలం రైతులను సంఘటితం చేయడం, వారి సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా రూ.600 కోట్లతో 2,601 రైతు వేదికల్ని నిర్మించామని తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్లలో క్లస్టర్ స్థాయిలో నిర్మించిన రైతువేదికను సీఎం కేసీఆర్ శనివారం ప్రారంభించారు. అనంతరం ఐదువేల మందితో ఏర్పాటుచేసిన ‘ఆత్మీయ రైతు సమ్మేళనం’ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘రైతు వేదిక నా గొప్ప కల. రైతాంగం ఒకచోట కూర్చొని మాట్లాడు కోవాలి. నియంత్రిత సాగుపై మాట్లాడినట్లే చర్చ చేయాలి. రైతు వేదిక ఒక ఆటంబాంబు. ఒక శక్తి’ అని సీఎం పేర్కొన్నారు. ‘ధరణి పోర్టల్, రైతు వేదికలు, రైతుబంధు, రైతుబీమా వట్టిగా పెట్ట లేదు. రైతులందరూ సంఘటితం కావాలనే ఉద్దేశం తోనే వీటన్నింటినీ చేపట్టాం. రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలి. కూరగాయలు, ధాన్యం ధరలు దళారుల చేతుల్లోకి పోవద్దు. వీటన్నింటిలో కీలకపాత్ర పోషించే రైతు వేదికలు దేశానికి ఆదర్శంగా నిలవబోతున్నాయి. తెలంగాణలో రైతురాజ్యం వచ్చి తీరుతది. తెలంగాణ రైతాంగమంతా కొన్ని విషయాలను సీరియస్‌గా తీసుకోవాలి. నేను సీఎం అయ్యేనాటికి వ్యవసాయ శాఖను చంపేశారు. కానీ ఇప్పుడు అన్ని పోస్టులు భర్తీ చేశాం. వ్యవసాయ శాఖ అద్భుతంగా పనిచేస్తోంది’ అని సీఎం అన్నారు.
జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదిక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్. చిత్రంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి,
మంత్రులు నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే రాజయ్య తదితరులు
రైతువేదికలు రైతు ప్రగతి కేంద్రాలు
రైతులంతా సంఘటితమై సాగులోని లాభనష్టాలు, వాడే పురుగుమందులు, మార్కెట్లో డిమాండ్, పంటను క్రమపద్ధతిలో మార్కెట్‌కు తరలించడం వంటివి రైతువేదికలో చర్చించుకోవాలని సీఎం సూచించారు. వీటిలో రైతుబంధు సమితి సభ్యులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. ప్రపంచం మొత్తమ్మీద ప్రభుత్వం రైతులకు వేదికలు నిర్మించడం తెలంగాణలోనే జరిగిందన్నారు. రైతువేదికల్లో టీవీలు ఏర్పాటుచేసి సీఎం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తల సూచనలు నేరుగా రైతులకు అందిస్తామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయిపూర్ రైతులు స్వచ్ఛందంగా సంఘం ఏర్పాటుచేసుకోవడంతో తక్కువ ధరకు ఎరువులు, పంట విక్రయ సమయంలోనూ మంచి ధర సాధిస్తున్నారన్నారు.
దేశానికే ఆదర్శంగా తెలంగాణ
‘దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను రైతుల కోసం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుల నుంచి ఎటువంటి దరఖాస్తు రాకుండానే వారి సంక్షేమంపై ఆలోచించి రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలను ప్రవేశపెట్టాం’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘రైతుబంధు ద్వారా ఇప్పటివరకు రైతుల ఖాతాలో నేరుగా సుమారు రూ.28 వేల కోట్లు జమ చేశాం. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. ఏటా రూ.1,200 కోట్లు ఖర్చుచేసి రైతుకు భద్రత కల్పించేందుకు రైతుబీమా అమలు చేస్తున్నాం. దేశంలో పూర్తిస్థాయిలో మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే. దేశవ్యాప్తంగా కొనుగోలు చేసిన ధాన్యంలో 55% వాటాతో తెలంగాణ రికార్డు సృష్టించింది అని కేసీఆర్ వివరించారు.
భూమి కౌలు, ఇల్లు కిరాయి ఒకటే..
రైతుల భూహక్కులను సంపూర్ణంగా రక్షించేందుకు, వారి సమస్యలు తొలగించేందుకు వీలుగా ధరణి పోర్టల్ రూపొందించామని సీఎం తెలిపారు. ‘పట్టాదారు రైతుల సంరక్షణ మా అజెండా. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎట్టి పరిస్థితుల్లో పట్టాదారు పాస్ పుస్తకాల్లో అనుభవదారుడు కాలమ్ రాయబోము. అనుభవదారుడిగా ఒక వ్యక్తి మూడేళ్లుంటే అతడికి భూమిపై హక్కు వస్తుంది. కోర్టులో కేసులువేసి అసలుదారుడిని ఇబ్బంది పెడుతున్నారు. పట్టణాల్లో ఇల్లు కిరాయికి ఇచ్చే సమయంలోనూ కిరాయిదారు అనే ప్రస్తావన పత్రాల్లోనూ, మరెక్కడా ఉండదు. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో సైతం అవసరం లేదు. భూమి కౌలుకివ్వడం ఇంటిని కిరాయికివ్వడం వంటిదే’ అని సీఎం వివరించారు. పల్లె ప్రగతి ద్వారా 12,751 గ్రామ పంచాయతీలకు ప్రతీనెలా సకాలంలో నిధులు విడుదల చేస్తుండడం, సర్పంచ్‌లు, పంచాయతీ సిబ్బంది తీసుకుంటున్న చర్యలతో ప్రజారోగ్యం మెరుగుపడుతోందన్నారు.
రైతు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి
కేంద్ర ప్రభుత్వం పూర్తి రైతు వ్యతిరేక వైఖరి అవలంభిస్తుందని, రైతులంతా దీనిపై సమష్టిగా ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతులపై కేంద్రానికి ప్రేమ లేదన్నారు. ప్రపంచంలోని దేశాలు రైతులకు సబ్సిడీలు ఇస్తుంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రమే అందించవద్దని చెబుతోందన్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ భయంకరమైన ఆంక్షలు విధించిందని, ధాన్యం కేవలం రూ.1,888కే కొనుగోలు చేయాలని, అధిక ధరకు కొంటే తాము సేకరించబోమంటూ దుర్మార్గ వైఖరి అవలంభిస్తుందన్నారు. ఎఫ్‌సీఐ నిబంధనతో సన్న వడ్లకు వెంటనే అధిక ధర ప్రకటించలేకపోతున్నామని, తప్పనిసరిగా మరోమార్గంలో ఆయా రైతులకు అధిక లాభం కలిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టం సైతం పూర్తి రైతు వ్యతిరేకంగా ఉందన్నారు. నూతన వ్యవసాయ చట్టాన్ని టీఆర్‌ఎస్, తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. సదరు దుర్మార్గపు చట్టం నుంచి రక్షించుకోవడానికి రైతు వేదికలు అవసరమైన సమయంలో తమ పాత్ర పోషించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
యాసంగిలోనూ సహకరించండి
వానాకాలంలో నియంత్రిత సాగుకు సహకరించిన రైతులు యాసంగిలోనూ సంపూర్ణంగా సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలతో మక్క పంటకు మద్దతు ధర లభించడం లేదని, అయినా కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మక్కలపై సుంకం 50% నుంచి 15% తగ్గించిందని సీఎం మండిపడ్డారు. వానాకాలంలో మక్కల సాగు బాగా తగ్గినా సాగు చేసిన కొందరు నష్టపోవద్దని రూ.600 కోట్లు నష్టం వస్తున్నా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. యాసంగిలో మాత్రం మక్క కాకుండా, కంది, శనగలు, పామాయిల్ వంటివి సాగు చేస్తే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని భరోసానిచ్చారు. త్వరలోనే తెలంగాణలో కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామని తెలిపారు. దళితులు, గిరిజనుల అభివృద్ధికి సైతం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి అమలుచేస్తామని, ఇప్పటికే రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించి మంచి విద్య అందిస్తున్నామని సీఎం వెల్లడించారు.
కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమం, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, ప్రభుత్వ విప్ బి.వెంకటేశ్వర్లు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్, జనగామ జిల్లా కలెక్టర్ కె.నిఖిల, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అది కిరికిరిగాళ్ల ముచ్చట
‘నియంత్రిత సాగు విధానంతో రైతులకు లాభం చేకూర్చాలని మేం పనిచేస్తుంటే కొంతమంది దుర్మార్గంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ దొంగ ముచ్చట్లు చెబుతున్నాడు. కిరికిరిగాళ్ల ముచ్చట్లు ఎట్ల ఉంటయో షబ్బీర్ అలీ కథ చూస్తే అర్థమైతది. షబ్బీర్ అలీ అనే కాంగ్రెస్ నాయకుడికి మెదక్ జిల్లా నార్సింగి మండలం జాప్తి శివనూరులోని సర్వే నంబర్ 408 నుంచి 413 వరకు భూములు ఉన్నాయి. అందులో వరి పంట కోసి గడ్డి కాలపెట్టిండు. సీఎం సన్నరకం పెట్టమంటే పెట్టిన.. నష్టపోయానని ఆయన ఫాంహౌస్‌లో పనిచేసే ఎలక్ట్రీషియన్ గణేశ్‌తో చెప్పించిండు. ఇదీ షబ్బీర్ అలీ కథ. ఇంత దొంగ ముచ్చట్లా? సోషల్ మీడియా కాదు.. యాంటీ సోషల్ మీడియా అయిపోయింది. ప్రతిపక్షాలకు దొంగ మాటలు మాట్లాడటం అలవాటైనా గుండెల నిండా నిజాయితీ ఉన్న సీఎంను ఎవరూ ఏం చేయలేరు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
పింఛన్లపై బీజేపీవి అబద్ధాలు
‘బీజేపీ నాయకులు పింఛన్ల విష యంలో పచ్చి అబద్ధాలు మాట్లాడు తున్నారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బు చెల్లిస్తున్నట్లు ఎవడైనా మొగోడు రుజువుచేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్‌ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్ధాలు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 38.65 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం గుండుగుత్తగా 7 లక్షల మందికి మాత్రమే ఇస్తుంది. అదీ రూ.200 మాత్రమే. సంవత్సరానికి కలిపి కేంద్రం ఇచ్చేది రూ.105 కోట్లు అయితే రాష్ట్రం రూ.10 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లు ఇస్తోంది. ఈ లెక్కలన్నీ ‘కాగ్’ అధికారికంగా విడుదల చేసింది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment