సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన విభేదాల ప్రభావం.. రాష్ట్ర ప్రభు త్వం, గవర్నర్ మధ్య సంబంధాలపై పడిందా? రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య అగాధం పెరిగిందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే సమాధానమిస్తున్నాయి. ఏటా పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించే రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలను ఈ ఏడాది కోవిడ్‌ను కారణంగా చూపి రాజ్‌భవన్‌కు మార్చడం.. సీఎం కేసీఆర్ సహా మంత్రు లు ఈ వేడుకలకు దూరంగా ఉండటం.. పైగా గవర్నర్ తన ప్రసంగంలో కేంద్రం, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం.. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలనుగానీ, సీఎం కేసీఆర్‌ను గానీ ప్రస్తావించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికితోడు గవర్నర్ గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఫోన్ చేసి నిజామాబాద్ జిల్లాలో ఆయనపై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి ఘటన గురించి ఆరాతీయడం కూడా.. విభేదాలకు అద్దంపడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పైకి ఏమీ లేదంటున్నా..!
కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌కు మార్చి నిరాడంబరంగా నిర్వహించాలని.. సీఎం, మంత్రులు వేడుకలకు దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనగా.. ఇక్కడ దూరంగా ఉండటం వెనుక రాజకీయ కారణాలున్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణ కన్నా ఎన్నోరెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో సైతం గణతంత్ర వేడుకలను యధావిధిగా నిర్వహించడం, ఆయా రాష్ట్రాల సీఎంలు వేడుకల్లో పాల్గొనడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
ఇక గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను అభినందించారు. కానీ ఎక్కడా సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రస్తావన తేలేదు. అంతేగాకుండా ఉస్మానియా సహా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, సేవలు మెరుగుపర్చాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఇక ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఫోన్ చేసి మాట్లాడిన గవర్నర్.. సదరు దాడి ఘటన గురించి కేంద్ర హోంశాఖకు నివేదిక సైతం పంపించనున్నట్టు తెలిసింది.
కేంద్రంపై కయ్యానికి దిగడంతో..
ఇటీవల యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడం, కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ పట్టుబట్టడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు కూడా. ఇది గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలపైనా ప్రభావం చూపినట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తమిళిసై గతనెలలో రాజ్‌భవన్ ప్రవేశద్వారం వద్ద గ్రీవెన్స్‌బాక్స్‌ను ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తుండటం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నాయి.
బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య విమర్శల పర్వం మొదలైన తర్వాతే.. గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేస్తున్నాయి. తమిళిసై రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటిపోయినా.. రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతతోనే వ్యవహరించారు. ఇటీవల కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం కయ్యానికి దిగడంతో.. గవర్నర్ తన అస్త్రాలను బయటకు తీసి, అమలుపరుస్తున్నట్టు చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment