సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లో ఉంటూ అన్ని వసతులు అనుభవిస్తున్న ఇక్కడి ఏపీ నేతలకు హైదరాబాద్ రాజధాని నీటి కష్టాలు పట్టవా?, ఇక్కడున్న ఆంధ్రా ప్రజలు కూడా ఏపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించాలి. పాలమూరు జిల్లా రైతుల ప్రయోజనాలు దెబ్బతీస్తూ కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పాదన అడ్డుకునేలా కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడం దారుణం. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలని కృష్ణా బోర్డు చెప్పడం సరికాదు. ఈ విషయంలో కేంద్రం ప్రేక్షక పాత్ర వహించడం తగదు. అన్యాయానికి గురవుతున్న తెలంగాణకు జాతీయ పార్టీలు అండగా ఉండాలి’ అని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, అంజయ్యయాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలసి సోమవారం టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అనేక అంశాల్లో కృష్ణా బోర్డు చోద్యం చూస్తోందని, ఏపీ చేపట్టిన అనేక అక్రమ ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించినా కృష్ణా బోర్డు అమలు చేయడం లేదన్నారు. ప్రాణాలు పోయినా లెక్క చేయం. నీళ్ల దోపిడీతోపాటు సమైక్య పాలకులు తెలంగాణకు చేసిన అన్యాయాలపై ఇంకా వందేళ్లయినా మాట్లాడుతూనే ఉంటాం’అని మంత్రి అన్నారు.
సమైక్య పాలనలో పాలమూరుకే ఎక్కువ నష్టం
సమైక్య పాలనలో ఎక్కువ నష్టపోయింది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మాత్రమేనని, పెండింగు ప్రాజెక్టులకు చిరునామాగా ఉన్నా జిల్లాను సస్యశ్యామలం చేసింది సీఎం కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా ప్రజలతో ఉమ్మడిగా పోరాటం చేసి జల హక్కులు కాపాడుకుంటామన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు పాలమూరు జిల్లా మీదుగా ప్రవహిస్తున్నా సమైక్య పాలకులు కరువు జిల్లాగా మార్చారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఏపీ దురాలోచనతో పాలమూరు ప్రాజెక్టులకు అన్యాయం చేస్తోందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఏపీ జల దోపిడీని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment