సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 కొలువుల భర్తీ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ఈ కొలువులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆకస్మికంగా వాయిదా పడగా.. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 విభాగాల్లో గ్రూప్–4 కేటగిరీలోని 9,168 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఈనెల 1న వెబ్ నోట్ (ప్రాథమిక ప్రకటన)ను విడుదల చేసింది.
ఈ క్రమంలో డిసెంబర్ 23వ తేదీన వెబ్‌సైట్‌లో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించిన కమిషన్.. 23వ తేదీ నుంచి 2023–జనవరి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆ వెబ్‌నోట్‌లో వెల్లడించింది. దీంతో అభ్యర్థులంతా దరఖాస్తుల భర్తీ, శిక్షణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆకస్మికంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు, రోస్టర్ ఆధారిత సమాచారంతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.
సాంకేతిక కారణాలంటూ..
సాంకేతిక కారణాల వల్ల గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ తేదీలను మార్పు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఒక వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. ఈనెల 30వ తేదీ నుంచి 2023 జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హత సమాచారాన్ని వెబ్‌సైట్‌లో చూసి నిర్దేశించిన ప్రొఫార్మా ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై స్పష్టత ఇవ్వనప్పటికీ, నిర్దేశించిన తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది.
కాగా, గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక ప్రకటనలో కేవలం శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల సంఖ్య మాత్రమే ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో జిల్లాల వారీగా ఖాళీలు, ఎవరెవరు అర్హులు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు.. తదితర పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. అయితే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం.. సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేయడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
తదుపరి ఏమవుతుందో..?
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక పోస్టులతో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రకటించడం ఇదే మొదటిసారి. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడుతుండగా.. ఈ ఖాళీల్లో గ్రూప్–4 కొలువుల సంఖ్య 12 శాతం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న వేళ నిరుద్యోగులు అత్యంత ఉత్సాహంతో సన్నద్ధమవుతుండగా టీఎస్‌పీఎస్సీ ఇలా అర్ధంతరంగా దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేయడం, పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేయకపోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శాఖల వారీగా సరైన సమాచారం అందకుండానే ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక ప్రకటన విడుదల చేశారనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment