సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకూ సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బీఆర్‌కేఆర్ భవన్‌లో మంగళవారం ఉద్యోగ నియామకాలపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్ రెడ్డితో కలసి ఆయన సమీక్షించారు.
రాష్ట్రంలో ఖాళీల భర్తీ ప్రక్రియ.. టీఎస్‌పీఎస్సీ, మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్‌మెంట్ బోర్డు తదితర ఏజెన్సీల ద్వారా జరుగుతుందని తెలిపారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన కచ్చితంగా పాటించడంతోపాటు, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
సర్వీస్ రూల్స్‌లో చేపట్టాల్సిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను టీఎస్‌పీఎస్సీకి అందించాలని కోరారు. దీని ఆధారంగా టీఎస్‌పీఎస్సీ వచ్చే నెల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్నారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రతిరోజూ పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురుకులాల కాలేజీలు, పాఠశాలల్లో భర్తీకి...
కొత్తగా అనుమతి ఇవ్వనున్న పోస్టుల్లో 3వేల వరకు గురుకుల సంస్థల్లో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గురుకుల నియామక బోర్డు ద్వారా గురుకుల డిగ్రీ, ఇంటర్ కళాశాలలతోపాటు పాఠశాలల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సైతం అనుమతులు రానున్నాయని తెలిసింది.
ఇప్పటి వరకు 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినా.. కొన్ని పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు వచ్చాయి. సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఆయా పోస్టుల భర్తీకి ఇండెంట్లు అందకపోవడంతో టీఎస్‌పీఎస్సీతోపాటు ఇతర నియామక సంస్థల నుంచి నోటిఫికేషన్ల జారీలో ఆలస్యం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఆయా శాఖలతో ఇండెంట్ల కోసం వరుసగా సమావేశాలు నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇండెంట్లు అందిన తర్వాత రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు సరిగ్గా ఉన్నాయా? లేదా ? అని పరిశీలించి చూడనుంది. అంతా సవ్యంగా ఉన్నట్టు నిర్ధారించుకున్న తర్వాత వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి నోటిఫికేషన్ల ప్రకటన ప్రారంభం కానుందని కమిషన్ వర్గాలు తెలిపాయి.
16,940 పోస్టులకు త్వరలో మరో నోటిఫికేషన్!
Published Wed, Nov 30 2022 2:57 AM | Last Updated on Wed, Nov 30 2022 2:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment