సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే అర్హత పరీక్షలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్న తపనతో లక్షలాది మంది నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారికి ఏమా త్రం అన్యాయం జరగకూడదనేదే మా లక్ష్యం. వాస్త వ పరిస్థితులకు భిన్నంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి.
తొందరపడి వాటిని నమ్మి అభ్యర్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దు’అని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత 4–5 రోజుల పరిణామాల దృష్ట్యా ఆయన మంగళవారం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులు, కార్యదర్శితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, ఇతరత్రా అంశాలపై పలు ప్రచారాల నేపథ్యంలో అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
17 వేల పోస్టులు... 26 ప్రకటనలు...
‘వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. 17,134 కొలువులకు సంబంధించి ఏడాది కాలంలో 26 ప్రకటనలు జారీ చేశాం. ఇందులో 6 రకాల అర్హత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. గత ఏడేళ్లలో 35 వేల ఉద్యోగాల భర్తీ జరిగితే కేవలం ఏడాదిలోనే 17 వేల కొలువులకు ప్రకటనలు జారీ చేశాం. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేయనున్నాం.
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన క్రమంలో అంతర్గత సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ రెండు పరీక్షల నిర్వహణను వాయిదా వేశాం. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 5న నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశ్నపత్రం లీకైందని గుర్తించాం.
ఇది ఎందరికి చేరింది... ఏయే సమాచారం ఎవరెవరికి చేరిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సాంకేతికత ఆధారంగా లీకేజీని గుర్తించేందుకు ఫోరెన్సిక్, సైబ ర్ భద్రతా విభాగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షపై బుధవారం మళ్లీ సమీక్షించాక నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని జనార్దన్‌రెడ్డి వివరించారు.
కార్యాలయానికి కొత్త సాంకేతికత...
ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో సాంకేతికతను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నాం. కంప్యూటర్ల మార్పుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొత్తగా తయారు చేసేందుకు చర్యలు మొదలుపెట్టాం. అతిత్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అర్హత పరీక్షల ప్రశ్నపత్రాలను తిరిగి రూపొందించాలని నిర్ణయించాం. అతిత్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తాం.
ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష నుంచి అన్ని రకాల పరీక్షలను నిర్దేశించిన తేదీల్లోనే నిర్వహిస్తాం. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అత్యంత పారదర్శకతతో అర్హతలున్న వారిని ఎంపిక చేయడయే మా పని’అని జనార్దన్‌రెడ్డి తెలిపారు.
నమ్మించి గొంతు కోసినట్లుగా...
‘ఒక కార్యాలయం అన్నాక ఎంతో మంది ఉద్యోగులుంటారు. ప్రతి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాం. అదే సమయంలో సహోద్యోగులకు వివిధ బాధ్యతలు అప్పగించి కార్యక్రమాలను సజావుగా సాగేలా చూస్తాం. ప్రవీణ్‌కుమార్ ఇక్కడ ఏళ్లుగా పనిచేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. ప్రతి ఉద్యోగి ఎలాంటివాడు? అతని నేప థ్యం ఏమిటని ఆరాతీసే పరిస్థితి ఉండదు. కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. ఏళ్లుగా నమ్మకంతో ఉన్నందున వివిధ బాధ్యతలు అప్పగించాం. రాజశేఖర్‌రెడ్డి నెట్‌వర్క్ విభాగంలో పనిచేస్తున్నా డు.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నమ్మించి గొంతుకోసిన చందంగా ఉంది. ప్రవీణ్ శాఖా పరంగా అనుమతి తీసుకొని గ్రూప్–1 ప్రిలిమిన రీ పరీక్ష రాశాడు. 103 మార్కులు వచ్చినట్లు తెలిసింది. కానీ పేపర్ కోడ్ సరిగ్గా వేయలేదని అనర్హుడైనట్లు సమాచారం. అయితే గ్రూప్–1 ప్రిలిమిన రీ అర్హుల్లో అత్యధిక మార్కులు 103 కంటే ఎక్కు వ. ప్రిలిమినరీ పరీక్షలో ర్యాంకులను పరిగణనలోకి తీసుకోం. దీంతో ఎక్కడా మార్కులు వెల్లడించలేదు. అభ్యర్థులకు మాత్రం వారి మార్కు లు చూసుకొనే వెసులుబాటు కల్పిస్తూ ఓఎంఆర్ పత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం.
ఈ పరీక్ష లీకేజీపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. సామాజిక మాధ్యమాల్లో అనవసర రాద్ధాంతాన్ని పరిగణించొద్దు. ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగదు. వాస్తవ పరిస్థితులను కనిపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం చర్యలుంటాయి’అని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment