సాక్షి,నిర్మల్: కోవిడ్ అనంతరం ఆర్టీసీ లాభాల బాట పడుతోంది. జిల్లాలోని నిర్మల్, భైంసా ఆర్టీసీ డిపోలు సీజన్ వారీగా అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో చౌకగా రవాణా సదుపాయం కల్పిస్తూ సంస్థ ఉన్నతికి దోహదపడుతున్నాయి. పెళ్లిళ్లకు బస్సుల అద్దెపై ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. వివాహాలకు బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
సెక్యూరిటీ డిపాజిట్ రద్దు...
పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు సంస్థ టార్గెట్ పెట్టుకుంది. పెళ్లి వారిని ఆకట్టుకునేందుకు సెక్యూరిటీ డిపాజిట్‌ను రద్దు చేసింది. గతంలో మొత్తం చార్జీలో 20శాతం అ డ్వాన్స్ చెల్లించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఆ డిపాజిట్‌ను రద్దు చేయడంతో ప్రజలు ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకు రావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీ బస్సులకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
చార్జీలు తక్కువే...
జిల్లాలో రెండు డిపోల నుంచి ఆర్టీసీ బస్సులను పెళ్లిళ్లకు అద్దెకు ఇస్తున్నారు. అప్ అండ్ డౌన్ కలిపి గరిష్టంగా 200కిలో మీటర్ల దూరం ఉంటే బస్సులు కేటాయిస్తారు. 200కిలో మీటర్ల లోపు ఉన్న బస్‌లకు ఒకటిన్నర టికెట్ చార్జీ చేస్తున్నారు. అలాగే 200కిలో మీటర్ల పైన ఉన్న పల్లె వెలుగులకు 10శాతం మాత్రమే అదనంగా చార్జ్ చేస్తున్నారు. సూపర్ లగ్జరీ, ఏక్స్‌ప్రెస్ బస్సులకు 240 కిమీ మీటర్లకంటే ఎక్కువగా ఉంటే అదనపు చార్జీలు తీసుకోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులను వివాహాలకు నిరంతరం అందుబాటులో ఉంచుతున్నారు. అయితే అప్ అండ్ డౌన్ 200 కిలోమీటర్ల కంటే తక్కువ ఉన్నా బస్సులను కేటాయిస్తారు. కనీస చార్జీ రూ.11,934 చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయం..
జిల్లాలోని నిర్మల్ ఆర్టీసీ డిపోలో సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 49 బస్సులను పెళ్లిళ్లకు అద్దెకు ఇచ్చారు. తద్వారా రూ.9,25,880 ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాగా ప్రైవేట్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల చార్జీలు తక్కువ కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు సురక్షిత ప్రయాణం కోరుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఆర్టీసీ సేవలు వినియోగించుకోవాలి
గతంలో బస్సుల అద్దె కోసం అడ్వాన్స్ ఉండేవి. ఇప్పుడు ఆర్టీసీ ఉన్నతాధికారులు రద్దు చేయడంతో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రైవేటు కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. పెళ్లిళ్ల కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలి.
– ఆంజనేయులు, డిపో మేనేజర్, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment