TSRTC: పాదచారులూ.. జర జాగ్రత్త | TSRTC Requests Pedestrians To Follow Traffic Rules | Sakshi
Sakshi News home page

TSRTC: పాదచారులూ.. జర జాగ్రత్త

Published Tue, Mar 21 2023 4:55 PM | Last Updated on Tue, Mar 21 2023 5:03 PM

TSRTC Requests Pedestrians To Follow Traffic Rules - Sakshi

హైదరాబాద్‌: పాదచారులు రహదారులపై వెళ్లేటప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూచిస్తోంది. అజాగ్రత్తగా వల్ల తమ విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దని చెప్తోంది. కొందరు పాదచారులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే టీఎస్‌ ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురువుతున్నాయని తమ పరిశీలనలో వెల్లడయిందని తెలిపింది. 

ఈ ఆర్థిక ఏడాదిలో ఫిబ్రవరి వరకు రోడ్డు ప్రమాదాల్లో 283 మంది మరణించారు. అందులో 71 మంది పాదచారులు ఉండటం ఆందోళన కలిగిస్తోన్న విషయం. రోడ్డు ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారిలో 25 శాతం పాదచారులే ఉండటం గమనార్హం. ప్రమాదాలు జరిగిన తీరుపై ఇటీవల టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు క్షుణ్ణంగా విచారణ చేశారు.  ట్రాఫిక్‌ రూల్స్‌పై సరైన అవగాహన లేకపోవడం వల్లే పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఈ విచారణలో వెల్లడైంది. 

‘రోడ్డు ప్రమాదాల నివారణకు టీఎస్‌ఆర్టీసీ అన్ని చర్యలను తీసుకుంటోంది.  దాదాపు 4 వేల మంది అద్దె బస్సు డ్రైవర్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలనూ సేప్టీ వార్డెన్లను నియమించి.. ప్రమాదాల నివారణకు ఎప్పటికప్పడు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తోంది. కానీ పాదచారులు తెలిసో తెలియకో చేసే చిన్న తప్పిదాల వల్ల టీఎస్‌ఆర్టీసీ బస్సులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగిన తీరును పరిశీలిస్తే వారికి ట్రాఫిక్‌ రూల్స్‌పై సరైన అవగాహన లేదనే విషయం స్పష్టమవుతోంది. అందుకే రహదారులపై పాదచారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారించిన ప్రాణాలకే ప్రమాదం ’అని టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ హెచ్చరించారు.

దేశంలో రోడ్డు ప్రమాదానికి గురువుతున్న ప్రతి ఐదుగురు బాధితుల్లో ఒకరు పాదచారులుంటున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఆయా ప్రమాదాల్లో 15 నుంచి 20 శాతం మంది పాదచారులు మృత్యువాతపడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పాదచారులు ట్రాపిక్‌ రూల్స్‌పై స్వీయ అవగాహన పెంచుకోవాలని సూచించారు. పాదచారులు అజాగ్రత్త వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కొల్పోయి తమ కుటుంబాలకు శోకాన్ని మిగల్చవద్దని హితవు పలికారు. 

పాదచారులూ.. ఈ నిబంధనలు పాటించండి

  • పాదచారులు ఫుట్‌పాత్‌లను ఉపయోగించుకోవాలి. రోడ్డును దాటేటప్పడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు.
  • గ్రామీణ ప్రాంతాల్లోని జాతీయ, రాష్ట్ర రహదారులను పాదచారులు నిర్లక్ష్యంగా దాటుతుంటారు. రోడ్డు దాటే క్రమంలో జీబ్రాలైన్‌ను వినియోగించుకోవాలి.
  • జీబ్రాలైన్‌ లేని చోట ఇరువైపులా వాహనాల రాకపోకలు లేనప్పుడే రోడ్డును క్రాస్‌ చేయాలి. పరధ్యానంలో అసలే ఉండొద్దు. 
  • పాదచారులు రాత్రుళ్లు రోడ్డు దాటేటప్పడు ఫ్లాష్‌ లైట్లను ఉపయోగించాలి.
  • సెల్‌ఫోన్‌, హియర్‌ ఫోన్స్‌ వాడుతూ రోడ్డు దాటడం ప్రమాదకరం. వాటి వల్ల వాహనాల హరన్‌ వినపడకపోవచ్చు. 
  • రోడ్డును తొందరగా దాటేందుకు కొందరూ పరిగెత్తుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. 
  • జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న గ్రామాల ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement