బోనాలు సందర్భంగా ఆదివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ దంపతులు
రాంగోపాల్‌పేట్: చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయానికి వచ్చారు. ఆయన సతీమణి స్వర్ణ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రి మొదటి పూజ చేసిన అనంతరం 4.15 గంటలకు సాధారణ భక్తులను అనుమతించారు. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం
ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణితో కలిసి అమ్మవారిని దర్శించుకుని పట్టువ్రస్తాలు సమర్పించి పూజలు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేకే తదితరులు కూడా సీఎంకు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ వచ్చారు.
కాగా హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కె.కవిత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వి.హన్మంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత బంగారు బోనంతో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి వచ్చే సమయంలో విడిగా వచ్చిన కవిత, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం తల్లిదండ్రులతో కలిసి వెళ్లారు.
పద్మారావు ఇంట్లో విందుకు సీఎం
మహంకాళి అమ్మవారికి పూజలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా టకారాబస్తీలోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి బోనాల విందును ఆరగించారు. సీఎంతో పాటు ఆయన సతీమణి, మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కవిత తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment