పుట్టుమచ్చ, మిస్సింగ్‌ డేటా ఆధారంగా..  | Uppal Police Chased Assassination Case | Sakshi
Sakshi News home page

పుట్టుమచ్చ, మిస్సింగ్‌ డేటా ఆధారంగా.. 

Published Thu, Jul 1 2021 7:27 AM | Last Updated on Thu, Jul 1 2021 10:41 AM

Uppal Police Chased Assassination Case - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న మల్కాజిగిరి ఇన్‌చార్జి డీసీపీ శ్రీనివాస్‌గుప్తా, ఏసీపీలు శ్యాంప్రసాద్, రంగస్వామి

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌ మెట్రో హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి చేయిపై ఉన్న పుట్టుమచ్చ ఆధారంగా.. వివిధ పోలీస్‌ స్టేషన్లలోని మిస్సింగ్‌ డేటా ఆధారంగా బాలానగర్‌కు చెందిన బాలరాజుగా గుర్తించారు. సెల్‌ఫోన్‌ దొంగిలించాడనే అనుమానంతోనే స్నేహితుడిని హత్య చేసినట్లు ధృవీకరించారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఆధునిక టెక్నాలజీకి పనిచెప్పిన పోలీసులు శవాన్ని తీసుకొచ్చిన ఆటోను గుర్తించి దాని ఆధారంగా నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం మల్కాజిగిరి ఇన్‌చార్జి డీసీపీ డి.శ్రీనివాస్‌గుప్త, ఏసీపీలు శ్యాంప్రసాద్, రంగస్వామితో కలిసి వెల్లడించారు.  

ఫోన్‌ చోరీ చేశాడనే అనుమానంతో.. 
ఉప్పల్‌ చిలుకానగర్‌లో నివాసముండే వి.మహేష్‌(33)కు మృతుడు బాలరాజు మిత్రుడు. 20వ తేదీన మహేష్, సాయి, బాలరాజు సనత్‌నగర్‌లో మద్యం తాగారు. మహేష్‌ తన ఆటోలో ఐడీపీఎల్‌ వద్ద బాలరాజును ఇంటి దగ్గర దించేసి వెళ్లారు. కొంతదూరం వెళ్లగా మహేష్‌ సెల్‌ఫోన్‌ కనిపించలేదు. మళ్లీ ఆటోలో బాలరాజు వద్దకు వెళ్లి ఆరా తీయగా తనకు తెలియదని చెప్పాడు. దీంతో అతడిని ఆటోలో చిలుకానగర్‌లోని వారి గదికి తీసుకువచ్చారు. మహేష్, సాయి, నాగరాజు ముగ్గురు కలిసి అతడిని తీవ్రంగా కొట్టారు. సాయి, నాగరాజు వెళ్లిపోయారు.  

అన్నదమ్ములు, భార్య సహకారం.. 
మహేష్‌ అన్న నరేష్‌(32), తమ్ముడు సుధీర్‌ ముగ్గురు కలసి మళ్లీ కొట్టారు. దెబ్బలకు తట్టుకోలేని బాలరాజు అదే రోజు మృతి చెందాడు. మృతదేహాన్ని ఆ ముగ్గురితో పాటు మహేష్‌ భార్య ఆటోలో ఎక్కించారు. ఉప్పల్‌ హెచ్‌ఎండీఏ లే అవుట్‌లోకి తీసుకెళ్లి కిరోసిన్‌ పోసి తగలబెట్టి వెళ్లిపోయారు. అనంతరం బండ్లగూడ నాగోల్‌లో ఉండే మహేష్‌ బావ కేతావత్‌ రవి(35) ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు.

కేసు ఛేదించిన పోలీసులు వి.మహేష్, వి.నరేష్, వి.సుధీర్, మహేష్‌ భార్య విజయ, ఆశ్రయం కల్పించిన కెతావత్‌ రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం వారిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, ఏసీపీ ఉప్పల్‌ ఎస్‌హెచ్‌వో రంగస్వామి, ఇన్‌స్పెక్టర్‌ గోవింద్‌రెడ్డి, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, ఏఎస్‌ఐ జయరాం, అంజయ్య, మైబెల్లి, ఏఎస్‌ఐ హనుమానాయక్‌ ఉన్నారు. 

చదవండి: దర్భంగ పేలుడు: హైదరాబాదే.. ఎందుకు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement