సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడి చర్యలతో పాటు విస్తృతస్థాయిలో ప్రజలకు పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించాలని తొమ్మిది వామపక్ష పార్టీలు, టీటీడీపీ, టీజేఎస్, తెలంగాణ ఇంటి పార్టీ కోరాయి. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నాయి. కరోనా నిర్మూలన, చికిత్సకు హైకోర్టు చెప్పిన విధంగా విస్తృత పరీక్షలు, హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో టెస్టుల నిర్వహణ, ఉచితంగా చికిత్స సౌకర్యాలను అందించాలని డిమాండ్ చేశాయి. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వివిధ వర్గాల పేదలకు నవంబర్ వరకు రూ.7,500 చొప్పున నగదు, ఉచిత రేషన్, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని విన్నవించాయి.
కరోనా వైరస్ వ్యాప్తితో ఏకకాలంలో బతుకుదెరువు ప్రమాదంలో పడడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశాయి. ఈ భయాందోళనలను దూరం చేసి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నాయి. శుక్రవారం రాసిన ఈ ఉమ్మడి లేఖను ప్రొఫెసర్ కోదండరాం (టీజేఎస్), చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం (సీపీఎం), ఎల్.రమణ (టీటీడీపీ), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ), సాధినేని వెంకటేశ్వరరావు, జె.వి.చలపతిరావు (న్యూడెమోక్రసీ రెండు గ్రూపులు), సీహెచ్ మురహరి (ఎస్‌యూసీఐ–సీ), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), ప్రసాద్ (సీపీఐ–ఎంఎల్), రాజేశ్ (లిబరేషన్) మీడియాకు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment