సాక్షి, కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే.. కరోనా కాలంలోనూ కంటికి కనిపించడంలేదని మండిపడుతున్నారు. నియోజకవర్గంలో రైతులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నా ఎమ్యెల్యే జాడలేకపోవడంతో నిరసన తెలియజేస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిసి.. జర్మనీలో ఉంటున్న ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గత అసెంబ్లీ ఎన్నికల్లో రమేష్‌పై స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
జర్మనీలో ఉన్న రమేష్ బాబును నియోజకవర్గానికి రప్పించేందుకు విమాన చార్జీల కోసం గురువారం వేములవాడ రాజన్న ఆలయం ముందు భిక్షాటనకు దిగారు. జర్మనీ నుంచి తమ ఎమ్మెల్యేను ప్రత్యేక విమానం ద్వారా తీసుకురావాలని డబ్బు జమ చేస్తున్నామని వారు తెలిపారు. సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రజా సమస్యలపై పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని గతంలోనూ రమేష్ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తమ ఎమ్మెల్యే కనపడుటలేదంటూ పోలీసులు సైతం స్థానికులు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే తీరు మార్చుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment