సాగును లాభసాటిగా మార్చాలి | Vice President M Venkaiah Naidu Comments On Agricultural Production | Sakshi

సాగును లాభసాటిగా మార్చాలి

May 15 2022 1:22 AM | Updated on May 15 2022 3:20 PM

Vice President M Venkaiah Naidu Comments On Agricultural Production - Sakshi

స్నాతకోత్సవంలో సర్టిఫికెట్లను అందజేస్తున్న వెంకయ్యనాయుడు 

ఏజీ వర్సిటీ: దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ రంగంలో జరిగే ప్రతి పరిశోధన అంతిమ లక్ష్యం వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం, వాతావరణ మార్పుల నుంచి పంటలను రక్షించుకోవడం, అన్నదాతల ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం, దేశ ఆహార భద్రతను కాపాడటమే కావాలన్నారు.

వెంకయ్య శనివారం రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (ఐసీఏఆర్‌–ఎన్‌ఏఏఆర్‌యం) స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ పరిశోధనలకు మరింత ప్రోత్సాహమివ్వాలని కోరారు. ప్రతి రైతును సంప్రదాయ విధానం, ఆధునాతన సాంకేతిక పద్ధతులతో కలిసి పనిచేసేలా చైతన్యపరచాల్సిన బాధ్యతను వ్యవసాయ విద్యాలయాలు తీసుకోవాలని సూచించారు.

రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే విషయంలోనూ స్థానిక భాషలోనే శాస్త్రవేత్తలు వారికి బోధించాలని చెప్పారు. జెనోమిక్స్, మాలిక్యులర్‌ బ్రీడింగ్, నానోటెక్నాలజీ మొదలైన రంగాలపై దృష్టిసారించాలన్నారు. డ్రోన్లు, కృత్రిమ మేధ వంటి సాంకేతికతనూ వ్యవసాయానికి మరింత చేరువ చేయడంలో ఐసీఏఆర్‌ మరింత కృషి చేయాలని చెప్పారు.

వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వారు వ్యవసాయాన్ని సంఘటిత రంగంగా మార్చేందుకు కృషి చేయాలని హితవు పలికారు. వాతావరణ సమస్యలు, ఇతర అనేక ఇబ్బందులు ఎన్నున్నా అన్నదాత తన బాధ్యతను విస్మరించకుండా ఆహారోత్పత్తికోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని వెంకయ్య చెప్పారు. కరోనా సమయంలోనూ దేశంలో ఆహారోత్పత్తి ఏమాత్రం తగ్గకపోగా ఉత్పత్తి పెరిగిందని, ఇది అన్నదాతల అంకితభావానికి నిదర్శమని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement