సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–రాచకొండ పోలీసు కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతంలో బామ్ ఫ్యామిలీ అరాచకాలు చేస్తోంది. బార్కస్ కేంద్రంగా దౌర్జన్యాలకు పాల్పడుతోంది. అబుబకర్ కాలనీలోని వీరి ఫామ్‌హౌస్‌లో ఓ యువకుడి బట్టలు తొలగించి దాడి చేశారు. ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు బామ్ కుటుంబాల వ్యవహారాలను ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసుల అండదండలతోనే వీళ్లు రెచ్చిపోతున్నారని, వీరిపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదైనా సరైన చర్యలు లేవని స్థానికులు వాపోతున్నారు.
500 మందితో అతి పెద్ద ‘కుటుంబంగా’..
పాతబస్తీలోని పాతబస్తీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే బామ్ కుటుంబం చాలా పెద్దదని స్థానికులు చెబుతున్నారు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, కజిన్స్... ఇలా మొత్తం దాదాపు 500 మంది ఉన్నారని వివరిస్తున్నారు. వీళ్లు ఇటు హైదరాబాద్–అటు రాచకొండ పోలీసు కమిషనరేట్ల సరిహద్దు ప్రాంతాల్లో అరాచకాలు చేస్తున్నారు.
దౌర్జన్యాలు, భూ కబ్జాలు, దాడులు ఇలా అనేక ఆరోపణలపై ఫిర్యాదులు, కేసులు సర్వసాధారణంగా మారిపోయింది. గొడవకు దిగాలన్నా, కబ్జాలకు పాల్పడాలన్నా వీళ్లు పథకం ప్రకారం ముందుకు వెళ్తారని బార్కస్ వాసులు చెబుతున్నారు. బార్కస్ బామ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఓ సంస్థను కూడా స్థాపించారని, దీని ముసుగులోనే కబ్జాలు చేస్తున్నారని బార్కస్ వాసులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు 50కి పైగా కేసులు...
ఈ కుటుంబానికి చెందిన సౌద్ బామ్, ఇక్బాల్ బామ్, ఫైసల్ బామ్, అహ్మద్ బామ్, హుస్సేన్ బామ్, అబూద్ బామ్, దావూద్ బామ్, సులేమాన్ బామ్, ఫహద్ బామ్, తయ్యబ్ బామ్, ఒమర్ బామ్, జఫార్ బామ్, ఉస్మాన్ బామ్, ఇబ్రహీం బామ్, జక్రియా బామ్ తదితరులపై ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. 2010 నుంచి ఆదిబట్ల, బాలాపూర్, చంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, సంతోష్‌నగర్, పహాడీషరీఫ్ తదితర ఠాణాల్లో వివిధ సెక్షన్ల కింద వీటిలో ఆరోపణలు ఉన్నాయి.
సీబీఐ, సీఐడీల్లోనూ బామ్ కుటుంబీకులపై రెండు కేసులు ఉన్నాయి. వీరి వ్యవహారాలు ఉన్నతా«ధికారుల వరకు వెళ్లకుండా కింది స్థాయి వారిని మ్యానేజ్ చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగానే శాంతిభద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచ్, నిఘా విభాగాలకు చెందిన వాళ్లు కూడా ఇక్కడ ఏం జరుగుతోందో ఉన్నతాధికారులకు చెప్పకుండా తప్పుదారి పట్టిస్తుంటారనే ఆరోపణలు ఉన్నాయి.
మేక చోరీకి యత్నించాడని దారుణం...
కొన్నాళ్ల క్రితం అబుబకర్ కాలనీలో ఉన్న ఫైసల్ బామ్ ఫామ్ హౌస్‌లో దారుణం చోటు చేసుకుంది. మేకను చోరీ చేయడానికి వచ్చాడనే ఆరోపణలపై ఓ యువకుడిని పట్టుకున్న బామ్స్ నగ్నంగా చేసి దారుణంగా కొట్టారు. ఆ సందర్భంగా వాళ్లల్లోనే ఒకరు తీసుకున్న వీడియో ఆలస్యంగా బయటకు రావడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని నగ్నంగా మార్చి కొట్టడంతో పాటు చుట్టూ నిల్చున్న వ్యక్తులు తమ ఫోన్లలో వీడియోలు చిత్రీకరిస్తుడటం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ వీడియోతో పాటు బామ్ కుటుంబాల వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్, రాచకొండలకు చెందిన అధికారులు దీనికోసం బుధవారం రంగంలోకి దిగినట్లు తెలిసింది. చట్టపరంగా పీడీ యాక్ట్ నమోదుకు ఆస్కారం ఉంటే ఆ దిశలో చర్యలు తీసుకోవాలని బార్కస్ వాసులు కోరుతున్నారు. బామ్స్‌కు భయపడి అనేక మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావట్లేదని చెప్తున్నారు.
పోలీసులు పక్షపాతంతో ఉన్నారు
గత నెల 21న సలాలా పీలీ దర్గా సమీపంలోని జిమ్ వద్ద ఘర్షణ జరిగింది. మా సోదరులైన ముగ్గురిపై బామ్ ఫ్యామిలీకి చెందిన దాదాపు 25 మంది దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే మా వాళ్లు ఆత్మరక్షణ కోసం కత్తితో దాడి చేశారు. చాంద్రాయణగుట్ట ఠాణాలో ఇరువర్గాలపై కేసులు నమోదయ్యాయి. మా వాళ్లను అరెస్టు చేసిన పోలీసులు రెండు కేసులు ఉన్నా బామ్ సంబంధీకుల జోలికి వెళ్లట్లేదు. మా సోదరులపై దాడి చేసిన వారిపై మేము ఇచ్చిన ఫిర్యాదుతో పాటు మరో దాన్నీ స్థానిక పోలీసులు పట్టించుకోవట్లేదు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి న్యాయం చేయాలి.
– సయీద్ బాయిసా ఆమోదీ, బార్కస్ వాసి
Comments
Please login to add a commentAdd a comment